మైకులు అందగానే ఆరోపణలు సరికాదు

రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని.. మైకులు అందగానే ఆరోపణలు చేయడం సరికాదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 27 Jan 2023 04:29 IST

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలి: స్పీకర్‌ పోచారం
రాష్ట్ర అభివృద్ధి కొందరికి కనపడకపోతే   చేసేదేం లేదు: మండలి ఛైర్మన్‌ గుత్తా

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని.. మైకులు అందగానే ఆరోపణలు చేయడం సరికాదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కొంతమంది కళ్లలో సంతోషం కోసం వ్యాఖ్యలు చేయొద్దని.. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. గురువారం శాసనసభ ప్రాంగణంలో, మండలి ఆవరణలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు శాసనసభ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని పాలించే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి. రాజకీయ పార్టీలు విమర్శలకే పరిమితం కావొద్దు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంది. దేశంలో నిరుపేదలకు ప్రగతిఫలాలు అందాలి. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉంది’’ అని చెప్పారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ ఉన్నత బాధ్యతల్లో ఉన్నవాళ్లు రాష్ట్ర అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని చెప్పారు. ‘‘తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం అమలవుతోంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి కొందరికి కనపడకపోతే చేసేదేం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేవారు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదు’’ అని పేర్కొన్నారు.  

మంత్రుల నివాసాల్లో..

ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌లు మంత్రుల నివాస ప్రాంగంణంలోని తమ ఇళ్ల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తాత్కాలిక సచివాలయంలో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని