‘పీఎం పోషణ్‌’ బలహీనం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లల మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచకపోగా...భారీగా తగ్గించారు.

Updated : 02 Feb 2023 05:42 IST

మధ్యాహ్న భోజన బడ్జెట్‌లో రూ.1200 కోట్ల కోత
పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసినా అమల్లోకి రాని అల్పాహార పంపిణీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లల మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచకపోగా...భారీగా తగ్గించారు. మధ్యాహ్న భోజన పథకానికి గత ఏడాది ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ (పీఎం పోషణ్‌)గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.10,234 కోట్లు కేటాయించింది. సవరణ బడ్జెట్‌లో దాన్ని రూ.12,800 కోట్లుగా చూపింది. అంటే అంచనా కంటే పథకానికి అయ్యే వ్యయం పెరగనుందని స్పష్టమవుతోంది. తాజా బడ్జెట్‌లో మాత్రం రూ.11,600 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. గత వ్యయం కంటే ఈసారి రూ.1200 కోట్లు తగ్గించడం గమనార్హం. ఒక వైపు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. నిధుల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి బడ్జెట్‌లో కోత పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

అల్పాహారం లేదు...విస్తరణా లేదు

విద్యార్థులు అధిక శాతం మంది ఉదయం ఖాళీ కడుపుతో బడులకు వస్తున్నారని, అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అధ్యయనాల నేపథ్యంలో 2021 మార్చిలో ఎంపీ వినయ్‌ సహస్రబుద్ధే ఛైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ ప్రతిరోజూ పిల్లలకు ఉదయం అల్పాహారం అందించాలని, ఏమీ తినకుండా మధ్యాహ్నం వరకు ఉండటం మంచిది కాదని సిఫారసు చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పథకాన్ని 1-8 తరగతులకే వర్తింపజేస్తున్నారని, దాన్ని 10వ తరగతి వరకు విస్తరించాలని కూడా సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అల్పాహారాన్ని అందించాలంటే రూ.4 వేల కోట్లు అవసరమని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అమలు చేయలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు 10వ తరగతి వరకు కూడా విస్తరించేందుకు అంగీకరించలేదు. ‘పాఠశాలలు పనిచేసేది 220 రోజులు...విద్యార్థులు సగటున హాజరయ్యేది 160 రోజులు. ఒక పూట భోజనానికి ఖర్చు చేసేది ప్రాథమిక విద్యార్థులకు రూ.5.45, 6-8 తరగతులకు రూ.8.17 మాత్రమే. అంటే సగటున ఒక్కో రోజుకు రూ.7 అనుకుంటే 160 రోజులకు ఒక విద్యార్థిపై ప్రభుత్వం ఖర్చు చేసేది రూ.1120 మాత్రమే’ అని విద్యాశాఖ అధికారి ఒకరు విశ్లేషించారు. ఇక అల్పాహారం అందిస్తే ఒక్కో విద్యార్థికి రూ.4 మాత్రమే ఖర్చు చేస్తారని, అయినా ఎందుకో ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు. బాల్యంలో పోషకాహారం ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా 11.20 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 11.80 కోట్ల మంది చిన్నారులు ప్రయోజనం పొందుతారు. మరో వైపు కరోనా కారణంగా నూనె, పప్పులు, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో భోజన తయారీకి వంట ఏజెన్సీ మహిళలకు ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయినా కేంద్రం రెండేళ్ల తర్వాత కూడా 9.60 శాతం మాత్రమే పెంచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు