కొందరికి వరం.. మరికొందరికి భారం

హైదరాబాద్‌ శివారు జవహర్‌నగర్‌ ప్రాంతంలో 2010కి ముందు ఓ వ్యక్తి 300 చ.గజాల ప్రభుత్వ స్థలాన్ని మరొకరి నుంచి రూ.2 లక్షలకు కొనుగోలు(నోటరీ ఒప్పందం) చేసి రేకుల ఇల్లు కట్టుకున్నాడు.

Updated : 06 Feb 2023 07:17 IST

భారీగా పెరిగిన భూముల ధరలు.. క్రమబద్ధీకరణకు కష్టాలు
125 గజాల విస్తీర్ణానికి మించి భూమి ఉన్న పేదలకు చుక్కలు
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ శివారు జవహర్‌నగర్‌ ప్రాంతంలో 2010కి ముందు ఓ వ్యక్తి 300 చ.గజాల ప్రభుత్వ స్థలాన్ని మరొకరి నుంచి రూ.2 లక్షలకు కొనుగోలు(నోటరీ ఒప్పందం) చేసి రేకుల ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా అధికారులు రూ.13.27 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నోటీసు పంపారు. ప్రైవేటు ఉద్యోగంతో బతుకుబండి లాగే ఆయన అంత మొత్తం ఎలా చెల్లించాలని తలపట్టుకున్నారు. కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. నగర శివారుల్లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.

నూట ఇరవై అయిదు చదరపు గజాలలోపు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు క్రమబద్ధీకరణ వరంగా మారగా.. అంతకు మించి విస్తీర్ణానికి క్రమబద్ధీకరణ మైదాన ప్రాంతాల్లో కొందరికి భారంగా మారుతోంది. కాలక్రమంలో భూముల ధరలు భారీగా పెరగడమే దీనికి కారణమవుతోంది. 2014కు ముందు నగరాలు, పురపాలికలు, మైదాన ప్రాంతాల శివారుల్లో భూముల ధరలు స్వల్పంగా ఉండేవి. రూ.వేలల్లో చెల్లిస్తే నివాసానికి వీలైన భూమి దొరికేది. ఎసైన్డ్‌ తదితర భూములు కూడా చౌకగా వచ్చేవి. చాలామంది రిజిస్ట్రేషన్‌ లేకున్నా స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నారు. రానురాను ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇప్పుడు ఆ భూములు క్రమబద్ధీకరించుకోవాలంటే రూ.లక్షల్లో రుసుం చెల్లించాల్సి రావడం పేద, మధ్యతరగతి వారిని ఇబ్బందిపెడుతోంది. ఈ నెలాఖరుకు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను శనివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. 125 చ.గజాలకు మించి స్థలాన్ని అధీనంలో ఉంచుకున్నవారు మార్కెట్‌ ధరను అనుసరించి ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి. దీనికి సంబంధించి నాలుగు రకాలుగా చెల్లింపులను నిర్ధరించారు. భూముల ధరలు భారీగా పెరిగినందున ఇప్పుడు క్రమబద్ధీకరించుకోవడానికి పెద్ద మొత్తం సర్దుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌ శివారుల్లో కాప్రా, అల్వాల్‌, జగద్గిరిగుట్టతోపాటు అనేక ప్రాంతాల్లో భూముల ధరల్లో మార్పులు వచ్చాయి. మార్కెట్‌ ధరను అనుసరించి ప్రభుత్వ అంచనాల మేరకు రుసుం నిర్ణయించి కలెక్టర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. క్రమబద్ధీకరణ పూర్తిచేసుకుంటే ఆ స్థలంపై బ్యాంకు రుణం వచ్చే అవకాశాలు ఉండటం ఊరటనిచ్చే అంశమైనా ఇప్పుడు సొమ్ము సర్దుబాటు కావడం కష్టమని సామాన్యులు వాపోతున్నారు.  

* జీవో ఎంఎస్‌.నం.59 అనుసరించి క్రమబద్ధీకరణకు 3 కిస్తీలలో ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

* 150 చ.గజాలలోపు నివాస స్థలాలకు ప్రభుత్వం గుర్తించిన మురికివాడల్లో మార్కెట్‌ ధరలో 10, ఇతర ప్రాంతాల్లో 25 శాతం చెల్లించాలి.  

* 250 చ.గజాల వరకు స్థలాలకు 25 శాతం

* 500 చ.గజాల వరకు 50 శాతం

* 1000 చ.గజాల వరకు స్థలాలకు 75 శాతం

125 చ.గజాల వరకు

125 చ.గజాల స్థలం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు ఆక్రమించి ఉంటే ఉచితంగానే దానిని క్రమబద్ధీకరించనున్నారు. ఇలాంటివి 95వేల వరకు దరఖాస్తులు అందగా పరిశీలన పూర్తయింది. పెద్దఎత్తున దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఒక్కొక్కరికి రెండు, మూడు ఇళ్లు ఉండటం, కుటుంబంలో ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే స్తోమత ఉన్నవారు కూడా దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు.

ప్రక్రియ ఇలా..

* 2022 ఫిబ్రవరి-మార్చి మధ్య జీవో ఎంఎస్‌.నం.58, 59ల కింద దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 1.61 లక్షలు వచ్చాయి.

* 2014 జూన్‌ రెండో తేదీకి ముందు నుంచి స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లు నల్లా, ఇంటి పన్నుల రసీదులు, విద్యుత్‌ బిల్లుల ఆధారాలు ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని