రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13.27 లక్షల కోట్లు

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. 2022-23లో 17.5 శాతం ఉండగా.. 2021-22లో ఇది 20.5 శాతం నమోదైంది.

Updated : 07 Feb 2023 03:20 IST

సేవల రంగానిదే పైచేయి.. 2022-23లో 17.5 శాతం నమోదు
తలసరి ఆదాయంలో రంగారెడ్డి ప్రథమం.. అట్టడుగున హనుమకొండ  
తెలంగాణ ఆర్థిక, సామాజిక నివేదిక-2023లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. 2022-23లో 17.5 శాతం ఉండగా.. 2021-22లో ఇది 20.5 శాతం నమోదైంది. ఈ రంగం పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, రవాణా, స్థిరాస్తి తదితర సేవలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక(సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌)-2023లో వివిధ రంగాల్లో తాజా పరిస్థితులను వెల్లడించింది. 2022-23లో సేవల రంగం విలువ రూ.7,50,408 కోట్లు. వ్యవసాయం, పశు సంవర్ధకం, మత్స్య, గనులు, ఖనిజాల నుంచి లభించే ఆదాయ అంచనా ప్రకారం ప్రాథమిక రంగం వాటా 11.7 శాతంగా తేలింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా విలువ రూ.2,45,794 కోట్లు. మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినియోగ సంబంధ సేవలు, నిర్మాణ రంగం కలిపి ద్వితీయ రంగంవాటా 10.6%. దీని విలువ రూ.1,98,575 కోట్లు. మొత్తం ఆదాయంలో జీఎస్‌డీపీ వాటా 15.6%. దీని విలువ రూ.13,27,495 కోట్లు. గతేడాది 19.4% నమోదైంది. విలువ రూ.11,48,115 కోట్లు. 2015-16లో జీఎస్‌డీపీ 14.2%. కరోనా కాలంలో 2019-20లో 10.8 శాతం, 2020-21లో 1.2శాతానికి పడిపోగా.. గతేడాది నుంచి పుంజుకుంది.

తలసరి ఆదాయం(పర్‌ క్యాపిటా)లో రూ.6,69,102లతో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాజధాని నగరంలో ఎక్కువ ప్రాంతం ఈ జిల్లాలోనే విస్తరించి ఉండటంతోపాటు ఐటీ, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాలు వృద్ధి చెందడంతో ఇక్కడ తలసరి ఆదాయం భారీగా నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా (రూ.3,49,061), సంగారెడ్డి (రూ.2,49,091), సిద్దిపేట జిల్లా (రూ.2,12,788) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హనుమకొండ జిల్లా రూ.1,30,821 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. ఆపై స్థానాల్లో కుమురం భీం ఆసిఫాబాద్‌ (రూ.1,31,843), వికారాబాద్‌ (రూ.1,31,962) జిల్లాలు ఉన్నాయి.

మండలాల సగటు జనాభా 61,366

మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలోని 612 మండలాల్లో మొత్తం జనాభా సుమారు 3.75 కోట్లు. దీని ప్రకారం ఒక్కో మండల సగటు జనాభా 61,366. అదే సమయంలో దేశంలో తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు కలిపి ఒక్కో మండల సగటు జనాభా 2.07 లక్షలుగా తేలింది. అంటే రాష్ట్రంలో మండల సగటు జనాభా చాలా తక్కువని స్పష్టమవుతోంది. తెలంగాణ తర్వాత అతి తక్కువ సగటు మండల జనాభా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. అక్కడ మండల సగటు జనాభా 79,023. అత్యధికంగా మహారాష్ట్రలో 3.53 లక్షలుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 828 మండలాలు/బ్లాక్‌లు ఉండగా.. 668 మండలాలతో ఏపీ, 612 మండలాలతో తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ప్రతి 100 మందికి 105 ఫోన్‌ కనెక్షన్లు

మొబైల్‌ కనెక్షన్ల వినియోగ సాంద్రతలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. దేశంలో ప్రతి 100 మందికి సగటున 83 కనెక్షన్లు ఉండగా.. రాష్ట్రంలో 105 ఉన్నాయి. 2022 నవంబరు నాటికి రాష్ట్రంలో 4.08 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అందులో 98 శాతం మొబైల్‌ వినియోగదారులే. మొత్తం వినియోగదారుల్లో 2.28 మంది నగర/పట్టణ వాసులున్నారు.


23 లక్షలు దాటిన ధరణి లావాదేవీలు

రణి పోర్టల్‌ ద్వారా ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ పూర్తికి 47 నిమిషాల సమయం పడుతోంది. 2020 నవంబరు రెండో తేదీ నుంచి 2023 జనవరి 27 వరకు 23.20 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల నిమిత్తం 17.30 లక్షల దరఖాస్తులు రాగా.. 16.59 లక్షలు పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు