ఆమె కోసం ఆరోగ్య మహిళ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మార్చి 8న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు.

Published : 07 Mar 2023 04:36 IST

8న వంద ప్రభుత్వాస్పత్రుల్లో ప్రారంభిస్తాం
ఏప్రిల్‌ నుంచి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, సంగారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మార్చి 8న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. తొలిదశగా వంద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని, ప్రతి మంగళవారం వైద్యులు, సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని వివరించారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీలేని రుణాల్లో రూ.750 కోట్లు అదేరోజు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సంతానలేమితో బాధపడేవారి కోసం రూ.16.5 కోట్లతో గాంధీ, పేట్లబుర్జు, వరంగల్‌లలో ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలో దాదాపు 4లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం దక్కేలా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ఏప్రిల్‌ నుంచి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. దశలవారీగా అన్ని గ్రామాల్లోనూ మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి సెర్ప్‌ ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందన్నారు. వీఏవో (గ్రామైక్య సంఘాల సహాయకులు)లకూ త్వరలోనే శుభవార్త వినిపిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ.... ర్యాగింగ్‌ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, దాని జోలికి వెళ్లొద్దని సూచించారు.

వాళ్లను ప్రజలే రద్దు చేస్తారు

సంగారెడ్డి కలెక్టరేట్‌లో 59 జీవో కింద లబ్ధిదారులకు పట్టాలిచ్చే క్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ... ధరణిపై అవగాహన లేని కాంగ్రెస్సోళ్లు దాన్ని రద్దు చేస్తామంటున్నారని, అలా మాట్లాడేవాళ్లనే ప్రజలు రద్దు చేస్తారన్నారు. కార్యక్రమాల్లో వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌ రెడ్డి, సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, తెలంగాణ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘మల్లారెడ్డి అభిమాని’తో ముచ్చట!

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. బీఏ తొలి సంవత్సరం విద్యార్థి సంగమేశ్వర్‌ను వేదిక వద్దకు రావాలని కోరారు. ‘మల్లారెడ్డి ఫ్యాన్‌.. మల్లారెడ్డి ఫ్యాన్‌’ అంటూ విద్యార్థులంతా అరవడంతో ‘మంత్రి మల్లారెడ్డిలా మాట్లాడు’ అంటూ మైక్‌ అందించారు. అతను ‘పాలమ్మిన... పూలమ్మిన’ అంటూ మల్లారెడ్డిని అనుకరించే ప్రయత్నం చేశారు. మల్లన్న సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతున్నట్లుండు.. మాలాంటోళ్లకే హిట్స్‌ లేవంటూ హరీశ్‌ చమత్కరించారు. మల్లారెడ్డి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకొచ్చారని, కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఉన్నతంగా జీవించొచ్చని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని