రాష్ట్రంలో బోర్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చండి

రాష్ట్రంలో ఏయే కేటగిరీల కింద ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని భూగర్భ జలవనరుల మదింపుపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలకు సూచించింది.

Published : 04 May 2024 05:19 IST

భూగర్భ జలవనరుల మదింపు కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏయే కేటగిరీల కింద ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని భూగర్భ జలవనరుల మదింపుపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలకు సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్రస్థాయి కమిటీ పలు అంశాలపై చర్చించింది. ‘రాష్ట్రంలో గత కొన్నేళ్ల నుంచి మంచి వర్షపాతం నమోదవుతూ వస్తోంది. గడిచిన ఏడాది కూడా మంచి వర్షాలే కురిశాయి. అయినప్పటికీ రాష్ట్రంలో కరవు తరహా వాతావరణం ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో ఉన్న బోర్ల పరిస్థితులు, వాటి సంఖ్యను గుర్తించాలి. జీహెచ్‌ఎంసీలో భూగర్భ జలాలకు సంబంధించి నిర్వహిస్తున్న ‘యాప్‌’ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి. బోర్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలో చట్టప్రకారం నిబంధనలు పాటించేలా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలి. మే నెలాఖరుకు సమాచారాన్ని సిద్ధం చేయాలి’ అని తీర్మానించారు. సమావేశంలో కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ప్రాంతీయ సంచాలకుడు కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌, రాష్ట్ర జల వనరులశాఖ ఉప సంచాలకుడు జ్యోతికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని