అదనపు ఆదాయానికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడి

బస్సులతో అదనపు ఆదాయం తేవాలంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెంచుతోందని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) మండిపడింది.

Published : 04 May 2024 05:18 IST

సంస్థలో యూనియన్లను అనుమతించాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బస్సులతో అదనపు ఆదాయం తేవాలంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెంచుతోందని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువచ్చేలా యాజమాన్యం వ్యవహరిస్తోందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల సమయాల్లో బయట తిరగొద్దంటూ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే.. ఆర్టీసీ అధికారులు మాత్రం సాధ్యాసాధ్యాలు చూడట్లేదని ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం బస్‌భవన్‌ వద్ద జరిగిన ఎస్‌డబ్ల్యూయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజు రూ.లక్ష అదనపు ఆదాయం తేవాలంటూ అధికారులు సమావేశాలు పెడుతున్నారని పేర్కొన్నారు. ‘ఆర్టీసీలో యూనియన్లను అనుమతించకపోవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనైనా కార్మిక సంఘాల్ని అనుమతించాలి. వేతన సవరణ బాండ్ల బకాయిలు వెంటనే చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 10న చలో బస్‌భవన్‌ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు.

నోటీసుల సమస్యల్ని పరిష్కరించాలి.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు అధిక పింఛను పథకానికి వస్తున్న డిమాండ్‌ నోటీసుల్లో అనేక సమస్యలు వస్తున్నాయని, వీటిని పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. సంఘం నేతలు వీఎస్‌ రావు, కె.గంగాధర్‌ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌)ని శుక్రవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని