సెప్టెంబరులోగా ‘గురుకుల’ రాతపరీక్షలు!

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు గురుకుల నియామక బోర్డు కసరత్తు చేస్తోంది.

Updated : 01 Jun 2023 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు లేదా సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించేందుకు గురుకుల నియామక బోర్డు కసరత్తు చేస్తోంది. గురుకుల పోస్టుల కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూలును త్వరలో ప్రకటించనుంది. టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల తేదీలకు అడ్డంకులు లేకుండా ఖరారు చేయనుంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టులకు దాదాపు 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మిగతా పోస్టులకు తక్కువగా వచ్చాయి. పీజీటీ, టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు 35 వేలలోపు వచ్చాయి. ఆయా పోస్టులకు ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. సెప్టెంబరులోగా పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గిరిజన గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించి, జూన్‌ 15లోగా గిరిజన గురుకుల వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. 

ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఉపకులపతి వెంకటరమణ, సంచాలకుడు సతీశ్‌కుమార్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. మొత్తం 1,500 సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిలో 1,404 జనరల్‌ సీట్లు, 96 స్పెషల్‌ కేటగిరీ(దివ్యాంగులు) ఉంటాయి. వీటికి అదనంగా 105 గ్లోబల్‌ సీట్లు భర్తీ చేయనున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు జూన్‌ 5 నుంచి ఆన్‌లైన్‌లో  (www.rgukt.ac.in/ www.admissions.rgukt.ac.in)  దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఉపకులపతి, సంచాలకుడు తెలిపారు. తుది గడువు జూన్‌ 19గా నిర్ణయించామని.. దివ్యాంగులు, సీఏపీ(సాయుధ సిబ్బంది పిల్లలు), ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అభ్యర్థులు జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూన్‌ 26న ప్రొవిజన్‌ సీట్ల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. పదో తరగతి మార్కులు(జీపీఏ) ఆధారంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ జులై 1న తొలి విడత ప్రవేశాలు చేపడతామన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి 3 హెల్ప్‌లైన్‌ నంబర్లు (7416002245, 7416058245, 7416012245) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మిగిలిన ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని