ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు చకచకా అడుగులు

ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగంలో భూసేకరణ చకచకా సాగుతోంది. సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకూ 158.50 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మొత్తం 4,760 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

Updated : 07 Jun 2023 04:28 IST

సంగారెడ్డి నుంచి జగదేవ్‌పూర్‌ వరకు రైతుల గుర్తింపు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగంలో భూసేకరణ చకచకా సాగుతోంది. సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకూ 158.50 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మొత్తం 4,760 ఎకరాలు సేకరించాల్సి ఉంది. తొలుత సంగారెడ్డి నుంచి అందోల్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ వరకు అయిదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,920.78 ఎకరాలు సేకరించనున్నారు. దీనికి సంబంధించి తుది అధ్యయనాన్ని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల యంత్రాంగం పూర్తి చేసింది. ఆయా జిల్లాల్లోని 5రెవెన్యూ డివిజన్ల మీదుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆయా భూముల యజమానుల గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆయా రైతులు, విస్తీర్ణం వివరాల నివేదికను జాతీయ రహదారుల సంస్థకు పంపనున్నట్లు సమాచారం. దీని ఆధారంగా భూ సేకరణకు కేంద్రం తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఆ తరవాత రైతులకు చెల్లింపుల ప్రక్రియ చేపడతారు. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. ఉత్తర భాగానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్ల వరకు చెల్లించాలి.

తొలుత 60 కి.మీ. నిర్మాణం!

కేంద్రం పలు దఫాలు లేఖలు రాసిన మీదట దశల వారీగా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగా ఇటీవల రూ.వంద కోట్లు విడుదల చేసింది. ఈ క్రమంలో తొలుత సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ వరకు రైతులకు పరిహారం చెల్లించి.. సుమారు 60 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే సంగారెడ్డి నుంచి జగదేవ్‌పూర్‌ వరకు భూసేకరణ కొలిక్కి వస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు మంజూరుచేస్తే అంతవరకు తొలివిడతలోనే రహదారి నిర్మాణం చేపట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని