పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి

జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్‌ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.

Published : 23 Apr 2024 03:59 IST

అధ్యయనానికి రాజస్థాన్‌ వెళ్లిన ఈఎన్సీ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్‌ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది. రాజస్థాన్‌లోని బీసల్‌పుర్‌ జలాశయంలో పూడిక వెలికితీతకు చేపట్టిన ప్రక్రియను నీటిపారుదల శాఖ ఇంజినీర్లు సోమవారం పరిశీలించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో సీఈ చంద్రశేఖర్‌, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌, డీఈఈ రాంప్రసాద్‌తో కూడిన బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది. పలు జలాశయాలు, డ్యాంలలో పేరుకుపోయిన పూడికను తొలగించడానికి తెలంగాణలో ప్రణాళికలు ఉన్నాయి. 25 ఏళ్ల కాలానికి గుత్తేదారులకు అప్పగించాలని యంత్రాంగం భావిస్తోంది.

పూడికతీత జాబితాలో...

రాష్ట్రంలో ఉన్న జలాశయాలు, డ్యాంలలో చాలా వాటిల్లో పూడిక పేరుకుపోయి ఉంది. నిర్మాణం తరువాత ఎక్కడా పూడికతీత ప్రక్రియ చేపట్టలేదు. ఇప్పటిదాకా తొలగించిన పూడికను నిల్వ చేయడం అతి పెద్ద సమస్యగా ఉంటూ వచ్చింది. ఇటీవల కాలంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ పనులు చేపడుతున్నాయి. తొలగించిన పూడికను మట్టి, ఇసుకగా విభజిస్తారు. మట్టిని రైతులకు ఉచితంగా అందజేయడం.. ఇసుకను మార్కెట్‌లో విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గుత్తేదారు సంస్థలు తీసుకునేలా.. రాష్ట్రంలో ప్రణాళికలు ఉన్నాయి. మూసి, సింగూరు, కడెం, మధ్య, దిగువ మానేరు జలాశయాలు, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని