Ramanujacharyulu: ముస్తాబైన ముచ్చింతల్‌

సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 రోజులపాటు చినజీయర్‌స్వామి

Updated : 02 Feb 2022 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 రోజులపాటు చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో క్రతువు కొనసాగనుంది. ఉత్సవాలలో భాగంగా భారీఎత్తున లక్ష్మీనారాయణ మహా యజ్ఞం కొనసాగనుంది. 108 దివ్యదేశాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ఠ, సమతామూర్తి లోకార్పణ జరగనుంది. నాలుగు వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, హవనం, పది కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపం, కోటిసార్లు మంత్ర హవనం, వివిధ పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం చేస్తారు. వేలాది వాలంటీర్లు, భక్తులు, రుత్వికుల రాకతో ముచ్చింతల్‌లో ఉత్సవ వాతావరణం ఏర్పడింది. ఫ్లెక్సీలు, తోరణాలతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. స్ఫూర్తికేంద్రానికి దారితీసే మార్గాలన్నీ కొత్తగా నిర్మించారు. ఉత్సవాలకు ఈనెల 5న ప్రధాని నరేంద్రమోదీ, 7న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, 8న హోంమంత్రి అమిత్‌ షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్నారు.

యాగశాలలు సిద్ధం

యాగశాలల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1035 కుండాలకు అవసరమైన యాగసామగ్రిని మహిళా వాలంటీర్లు సిద్ధం చేస్తున్నారు. మండపాలను వివిధ రూపాల్లో అలంకరించారు. అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దారు.  హోమాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొంటున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పదివేల పాత్రలను రాజస్థాన్‌ నుంచి తెప్పించినట్లు అహోబిల జీయర్‌స్వామి వివరించారు. 

వాలంటీర్ల రాక

దేశవిదేశాల నుంచి భక్తులు, వాలంటీర్లు ఇప్పటికే ఆశ్రమానికి చేరుకున్నారు. వికాసతరంగిణి సంస్థ సభ్యులు సహా 12 వేల మంది వచ్చి సేవలు అందించనున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు ఏపీ, తెలంగాణలోని 20 జిల్లాలు, మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు.

తొలిరోజు కార్యక్రమాలకు ఇలా...

యాగశాల వద్ద బుధవారం ఉదయం 9 గంటలకు శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాలలో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. అరణి మథనం, అగ్ని ప్రతిష్ఠ జరుగుతాయి.

7 వేల మందితో భద్రత

ప్రాంగణం పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో 7వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం జీవా ప్రాంగణంలో పోలీసు అధికారులు, సిబ్బందితో చినజీయర్‌స్వామి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, స్టీఫెన్‌ రవీంద్రలు సమావేశమయ్యారు. ఎనిమిది అగ్నిమాపక శకటాలు అందుబాటులో ఉంచగా.. యశోద ఆసుపత్రి, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని