Updated : 08/12/2022 20:21 IST

అదను చూసి.. జీవితం కాటేసింది

అదను చూసి.. జీవితం కాటేసింది

రోజు నా పెళ్లిచూపులు. మనసులో టెన్షన్‌. అబ్బాయినైనా ఎందుకిలా అంటే నా అవిటితనం. చిన్నప్పుడే పోలియో సోకింది. ఏ అమ్మాయీ నన్నిష్టపడదనే అభిప్రాయం. అందుకే పెళ్లే వద్దనుకున్నా. ‘నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్లున్నారు. వాళ్ల కోసమైనా చేసుకోరా’ బతిమాలేది అమ్మ. ఆమె కోసమే ఒప్పుకున్నా. నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి పత్తా లేకుండా పోయాడు. అమ్మే అన్నీ తానై సాకింది. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగానే సిటీకొచ్చి ఓ చిన్నపాటి ఉద్యోగంలో చేరా. ఆరేళ్లు గడిచాయి. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాం.

ఆ అమ్మాయి పేరు పూర్ణిమ. చిన్నప్పుడే అమ్మ చనిపోతే అమ్మమ్మ పెంచిందట. నాన్న తాగుబోతు. పేద కుటుంబం. ‘నేను నచ్చానా? నా వైకల్యం సంగతి తెలుసా?’ పెళ్లిచూపుల్లో అడిగా. ‘నాదేం లేదు.. అంతా పెద్దవాళ్లిష్టం’ ముక్తసరిగా సమాధానం చెప్పింది. తంతు ముగిసింది. ‘మాకు మీ సంబంధం నచ్చలేదు’ పదిరోజులయ్యాక కబురు పంపారు. నేనూహించిందే. ఉసూరుమన్నా.

ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో ఎంబీఏలో చేరా. ఏడాది గడిచాక వాళ్లు మళ్లీ ఫోన్‌ చేశారు. నన్ను పెళ్లాడటానికి అమ్మాయి ఒప్పుకుందట. అప్పుడు వద్దని ఇప్పుడు కావాలనుకోవడమేంటి? ‘ఇందులో ఏదో మతలబు ఉంది. నేను చేసుకోను. కావాలంటే ఓ ఆర్నెళ్లు ఆగుదాం’ నా అభిప్రాయం చెప్పేశా. మావాళ్లు వింటేగా! పరుగున వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకోవడం.. రెండునెలల్లో పెళ్లి చకచకా జరిగిపోయాయి.

మూణ్నెళ్లు చిలకా గోరింకల్లా ఉన్నాం. ఆపై నెలకోసారైనా మా ఇంటికొచ్చేవాడు మామయ్య. డబ్బులడిగేవాడు. ముందు అర్థింపుగా.. ఆపై ఆర్డరేస్తున్నట్టుగా. ఉంటే ఇచ్చేవాణ్ని. లేకుంటే లేవని చెప్పేవాణ్ని. పూర్ణిమ అలిగేది. ఆనక మౌనవ్రతం, ఉపవాసం. గొడవలు మొదలయ్యాయి. ఏంటీ బాధ? అసలు నన్నెందుకు పెళ్లాడినట్టు? ఆరా తీస్తే తెలిసింది. గుండెజబ్బుతో చనిపోయే పరిస్థితుల్లో ఉంటే నాన్న మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకుందని. కారణమేదైనా తాళికట్టి ఆలి అయింది. కళ్లలో పెట్టుకొని చూసుకోవాలనుకున్నా. అయినా ఏం లాభం? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు!

మొదటి పెళ్లిరోజున తనడిగితే వాళ్ల పుట్టింటికి తీస్కెళ్లా. అకారణంగా గొడవ సృష్టించారు. పెద్ద మొత్తం డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇవ్వనని ఖరాఖండిగా చెప్పా. నామీద, మా అమ్మ మీద గృహహింస కేసు పెట్టారు. వాళ్ల నాన్నే ఇదంతా చేయిస్తున్నాడని తెలుసు. ఆ విషయం తెలుసుకొని నా దగ్గరికొచ్చేయమని మొత్తుకున్నా. తను విన్లేదు. విడాకులు కావాలంది. ఆర్నెళ్లు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగా. ‘అరవై వేలు ఇవ్వు. కేస్‌ వాపస్‌ తీస్కుంటాం’ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారు. ఎంత నమ్మకద్రోహం? పైసా కట్నం లేకుండా ఆమెని పెళ్లి చేసుకున్నా.. లక్ష రూపాయల ఖర్చైంది. ఇప్పుడు యాభై వేలిచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నా.

డబ్బులు పోయాయి. ఏడాది మానసిక క్షోభ అనుభవించా. అప్పులు మిగిలాయి. పైగా పెళ్లాం వదిలేసిందనే నింద. అయినా ఇప్పుడెంతో హాయిగా, సంతోషంగా ఉన్నా. రాజీ పడుతూ అనుక్షణం నరకం అనుభవించే బదులు.. విడిపోవడమే మంచిదైంది. అవసరం కోసం మోసం చేసే అమ్మాయిలు ఉంటారని గతంలో విన్నా. నా విషయంలో ప్రత్యక్షంగా చూశా. అందరూ అలా ఉంటారని కాదు.. కొందరైనా అలా ఉంటారు. జాగ్రత్త.

- సదయ్య (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్