Airbus Atlantic: క్రిస్మస్‌ విందు.. 700 మంది విమానయాన సంస్థ సిబ్బందికి అస్వస్థత

ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వారిలో సుమారు 700 మంది అస్వస్థకు గురయ్యారు.

Published : 25 Dec 2023 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిస్మస్‌ వేడుకల వేళ ఓ సంస్థ ఇచ్చిన విందు వందలాది మంది అస్వస్థతకు కారణమైంది. ఈ విందుకు హాజరైన వారిలో సుమారు 700 మంది అనారోగ్యం బారినపడ్డారు. వీరిలో కొంతమంది తీవ్ర కడుపునొప్పితో బాధపడినట్లు తెలిసింది. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ విమానయాన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ విమానయాన సంస్థ.. తమ సిబ్బందికి డిసెంబర్‌ 14న క్రిస్మస్‌ విందు ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి సుమారు 2600 మంది ఉద్యోగులు హాజరయ్యారు. రుచికరమైన వంటకాలు, రకరకాల స్వీట్లు, చాక్లెట్లు ఐస్‌క్రీమ్‌లతో వేడుక ఘనంగా జరిగింది. మరుసటి రోజు నుంచి ఆ వేడుకలో పాల్గొన్న వారిలో అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 700 మంది వాంతులు, విరేచనాలతో బాధపడినట్లు సమాచారం. వీరిలో కొంతమంది తీవ్ర కడుపునొప్పి, తలనొప్పితో బాధపడినట్లు తెలిపారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ సంస్థ ఏర్పాటు చేసిన విందు అనంతరం అనేక మంది అస్వస్థతకు గురైనట్లు యూరోపియన్‌ ఏరోనాటిక్స్‌ వెల్లడించింది. ఈ కలుషిత ఆహారానికి గల కారణాలపై ఫ్రాన్స్‌ ఆరోగ్య సంస్థ దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు ఐదు దేశాల్లో 15వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీనికి ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ అనుబంధ సంస్థగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని