US- China: ఆ బెలూన్‌ ఘటన అంతా మార్చేసింది.. చైనాతో సంబంధాలపై బైడెన్‌!

నిఘా బెలూన్‌ పేల్చివేత అనంతరం అమెరికా- చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. అయితే, అతి త్వరలోనే అవి మళ్లీ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Published : 22 May 2023 02:03 IST

టోక్యో: చైనా (China)కు చెందిన ఓ నిఘా బెలూన్‌ (Spy Balloon)ను తాము కూల్చివేసిన అనంతరం.. ఆ దేశంతో చర్చల విషయంలో ఏదీ మునుపటిలా లేకుండా పోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తెలిపారు. అయితే.. తమ రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు (US- China Ties) అతి త్వరలో మళ్లీ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌లో జీ-7 శిఖరాగ్ర సమావేశం (G7 Summit) అనంతరం మీడియా సమావేశంలో బైడెన్‌ మాట్లాడారు. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడిన నెలల వ్యవధిలోనే తమ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని వెల్లడించారు.

అమెరికా, చైనాల మధ్య హాట్‌లైన్ (సంప్రదింపుల మాధ్యమం) ఎందుకు పనిచేయడం లేదన్న ప్రశ్నకు బైడెన్‌ బదులిస్తూ.. ‘మీరు చెప్పింది నిజమే. మేం ఓపెన్ హాట్‌లైన్‌ని కలిగి ఉండాలి. గత జీ-20 సమావేశంలో జిన్‌పింగ్‌, నేను ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. భేటీ అయ్యేందుకు అంగీకరించాం. ఆ తర్వాత.. అమెరికా మీదుగా ప్రయాణించిన ఓ గూఢచర్య బెలూన్‌ను పేల్చేశాం. దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోయాయి. అయితే, ఈ ప్రతిష్ఠంభన త్వరలోనే పరిష్కారమవడాన్ని మీరు చూస్తారు’ అని బైడెన్‌ తెలిపారు. అధునాతన మైక్రోచిప్స్‌ వాణిజ్యం విషయంలో చైనాపై విధించిన ఆంక్షలను సమర్థించుకున్నారు. వాటితో చైనా తన సైనిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోందని ఆరోపించారు.

అసలే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా- చైనా సంబంధాలను నిఘా బెలూన్‌ వ్యవహారం కుదిపేసిన విషయం తెలిసిందే. క్షిపణి స్థావరాలపై గూఢచర్యం కోసమే ఆ ‘ఎయిర్‌షిప్‌’ను తమ దేశంపైకి చైనా ప్రయోగించిందని ఆరోపించిన అగ్రరాజ్యం.. దాన్ని కూల్చేసింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఒక్కసారిగా వేడి పెరిగింది. బీజింగ్‌లో చేపట్టాల్సిన తన పర్యటనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ రద్దు చేసుకున్నారు. మరోవైపు.. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన బెలూన్‌ను ధ్వంసం చేయడం ద్వారా అమెరికా హద్దులు మీరిందని విమర్శించింది. దీనిపై తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని