Anand Mahindra: వైట్‌హౌస్‌లో స్టేట్‌ డిన్నర్‌.. ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారు?

వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన స్టేట్‌ డిన్నర్‌కు సంబంధించిన వీడియోలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు.

Updated : 23 Jun 2023 16:01 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్‌ సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తికరమైన ఏ విషయం తన దృష్టికి వచ్చినా అందరితోనూ పంచుకుంటారు. ఆయన ఏదైనా అంశాన్ని పోస్టు చేశారంటే...  అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందనడంలో సందేహం లేదు. తాజాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనను పురస్కరించుకొని, ఆయన గౌరవార్థం వైట్‌హౌస్‌లో (White House) స్టేట్‌ డిన్నర్‌ను (State dinner) ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు దాదాపు 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. అందులో ఆనంద్‌ మహీంద్రా కూడా ఉన్నారు. తాజాగా డిన్నర్‌ ఏర్పాట్లు, అక్కడి ఆతిథ్యం ఎలా ఉంటుందో తెలియజెప్పేలా ఆయన కొన్ని వీడియోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

‘‘ ప్రధాని మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లో స్టేట్‌ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు పంచుకుంటానని మాటిచ్చాను. డిన్నర్‌లో వడ్డించిన వంటకాల విషయం పక్కన పెడితే.. అక్కడి సంగీత ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయాను.’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ నైట్‌లో ప్రముఖ వయోలినిస్ట్‌ జోషువా బెల్‌, దక్షిణ ఆసియాకు చెందిన పెన్‌ మసాలా గ్రూప్‌, యూఎస్‌ మెరైన్‌బాండ్‌ ఆర్కెస్ట్రా తమ గీతాలతో అలరించారు. వైట్‌హౌస్‌ లాన్‌లో భారత జాతీయ జెండాలోని త్రివర్ణ రంగులను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై ఆకుపచ్చ కాషాయ రంగుల్లో పుష్పాలను భారత జాతీయ పుష్పం కమలాన్ని ఏర్పాటు చేశారు. ఇరు దేశాల జాతీయ పక్షులైన గ్రద్ధ, నెమలి చిత్రాలను ప్రదర్శించారు.

వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విందుకు పారిశ్రామిక వేత్తలు, బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు, ఫ్యాషన్‌ ఐకాన్‌లు హాజరయ్యారు. అధ్యక్షుడు జోబైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ దాదాపు 400 మంది అతిథులను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ విందులో భారత బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, కార్పొరేట్‌ దిగ్గజం ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ హాజరయ్యారు. అలాగే మానవహక్కుల ఉద్యమకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌-3, టెన్నిస్‌ ఆటగాడు బిల్లీ జేన్‌ కింగ్‌, సినీ ప్రముఖుడు నైట్‌ శ్యామలన్‌, ఫ్యాషన్ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్‌, వ్యాపారవేత్త ఫ్రాంక్‌ ఇస్లామ్‌, గ్రామీ అవార్డు గ్రహీత జాషువా బెల్‌ పాల్గొన్నారు. ఇక ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యులు, రోఖన్నా, ప్రమీలా జయపాల్‌, బైడెన్‌ కుటుంబ సభ్యులు హంటర్‌, యాష్లే, జేమ్స్‌, నవోమీ బైడెన్‌ కూడా విందుకు హాజరయ్యారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని