Angelina Jolie: ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూడలేదు.. పాక్‌ వరదలపై ఏంజెలినా జోలి

ఇటీవల పాకిస్థాన్‌లో అనూహ్యంగా విరుచుకుపడిన వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. దీనిపై హాలివుడ్‌ స్టార్‌, మానవతావాది ఏంజెలినా జోలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు....

Published : 23 Sep 2022 02:23 IST

ఇస్లామాబాద్‌: ఇటీవల పాకిస్థాన్‌లో అనూహ్యంగా విరుచుకుపడిన వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. దీనిపై హాలివుడ్‌ స్టార్‌, మానవతావాది ఏంజెలినా జోలి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ప్రపంచ దేశాలకు ఒక మేల్కొలుపులాంటిదని తెలిపారు. తాను ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో పర్యటించారు. వరదల వల్ల నిరాశ్రయులై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితుల్ని పరామర్శించారు.

‘‘ఈ విపత్తు ప్రపంచ దేశాలకు ఒక మేల్కొలుపు. నేను ఇలాంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూడలేదు. నేను తప్పకుండా బాధితుల పక్షాన ఉంటాను. సాయం కోసం అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థిస్తాను. వాతావరణ మార్పుల వల్ల దుష్పరిణామాలు సంభవిస్తాయనడం నిజం. అది మన కళ్ల ముందే ఉంది. నేను సాయం కోసం పలువురు వ్యక్తులను సంప్రదిస్తున్నాను’’ అని ఇస్లామాబాద్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఏంజెలినా జోలి అన్నారు. ప్రస్తుతం ఏంజెలినా యూఎన్‌హెచ్‌సీఆర్‌కు సౌహార్ద రాయబారిగా వ్యవహరిస్తున్నారు.

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పాక్‌ వరదలతో అతలాకుతలమైంది. దాదాపు మూడోవంతు దేశ భాభాగాన్ని వరదలు ముంచెత్తాయి. 1600 మందికిపైగా మరణించారు. మరో 70 లక్షల మంది ఇంకా తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో జీవనం సాగిస్తున్నారు. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అపరిశుభ్రత ఇప్పుడు సవాల్‌ విసురుతోంది. కలరా, డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని సాయం కోసం అర్థిస్తోంది. ఐరాస సహా అమెరికా, కెనడా వంటి దేశాలు సాయం కోసం ముందుకొచ్చాయి. ఇప్పటికే ఆ దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని