Yoga: మాల్దీవుల్లో యోగా.. అడ్డుకున్న ఆందోళనకారులు.. అధ్యక్షుడు సీరియస్..!

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. మాల్దీవుల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారు........

Published : 21 Jun 2022 20:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మాల్దీవుల్లో (Maldives) నిర్వహించిన యోగా (yoga) కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (international yoga day) పురస్కరించుకొని రాజధాని మాలేలోని జాతీయ ఫుట్‌బాల్‌ స్టేడియం గలోల్హులో ఔత్సాహికులు సహా ప్రముఖులు యోగా చేస్తుండగా.. అనేకమంది స్టేడియంలోకి దూసుకొచ్చారు. యువజన, క్రీడలు, కమ్యూనిటీ సాధికారత మంత్రిత్వ శాఖతో కలిసి ఇండియన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా.. కొందరు జెండాలు పట్టుకొని, నినాదాలు చేస్తూ స్టేడియంలోకి చొరబడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారి చర్యలతో ఔత్సాహికులను భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ యోగా కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు సహా మాల్దీవుల ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా వారిని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనేకమంది కర్రలు, జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ.. మ్యాట్‌లపై యోగా, ధ్యానం చేస్తున్నవారి వద్దకు వెళుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి జెండాలని పీకి సామగ్రిని ద్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురైన ఔత్సాహికులు స్టేడియం నుంచి పరుగులుపెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోని దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు.

కాగా ఈ ఘటనపై మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలీ సీరియస్‌ అయ్యారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఉదయం గలోల్హు స్టేడియంలో జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులను త్వరలోనే చట్టం ముందు ప్రవేశపెడతారు’ అంటూ అధ్యక్షుడు సోలీ ట్వీట్ చేశారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని