Australia: అత్యధిక పబ్‌లు చుట్టేసి.. గిన్నిస్‌ రికార్డు బద్దలుకొట్టేసి!

గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కేందుకు ఒక్కొక్కరిది ఒక్కో ప్రయత్నం. ఇలాగే.. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో పబ్‌లను సందర్శించి రికార్డు నెలకొల్పాడో ఆస్ట్రేలియా యువకుడు. 24 గంటల వ్యవధిలోనే అతను వేర్వేరు ప్రదేశాల్లోని 78 పబ్‌లను చుట్టేయడం విశేషం.

Published : 13 Nov 2022 01:33 IST

కాన్‌బెర్రా: గిన్నిస్‌ రికార్డుల్లో(Guinness World Record)కి ఎక్కేందుకు ఒక్కొక్కరిది ఒక్కో ప్రయత్నం. ఇలాగే.. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో పబ్‌(Pub)లను సందర్శించి రికార్డు నెలకొల్పాడో ఆస్ట్రేలియా(Australia) యువకుడు. 24 గంటల వ్యవధిలోనే అతను వేర్వేరు ప్రదేశాల్లోని 78 పబ్‌లను చుట్టేయడం విశేషం. మెల్‌బోర్న్‌లో నివసిస్తోన్న హెన్రిక్‌ డివిలియర్స్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 10- 11వ తేదీల్లో తాను ఉంటున్న నగరంలోనే ఈ రికార్డు సాధించినట్లు గిన్నిస్‌ సంస్థ తాజాగా తెలిపింది. ఇదివరకు ఈ రికార్డు.. ఇంగ్లాండ్‌కు చెందిన నాథన్ క్రింప్ పేరుమీద ఉంది. అతను 67 పబ్‌లను సందర్శించాడు. తన ఇద్దరు స్నేహితులు వెంటరాగ.. 23 ఏళ్ల హెన్రిక్‌ తాజాగా దీన్ని బద్దలుకొట్టాడు.

కొవిడ్‌ సమయంలో తీవ్రంగా ప్రభావితమైన పబ్‌లు, బార్‌లపై మరోసారి ప్రజల దృష్టి పడేలా చేయడంతోపాటు మెల్‌బోర్న్‌లో అంతగా వెలుగులోకి రాని ప్రాంతాలను జనాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తాను ఈ సవాల్‌ను స్వీకరించినట్లు హెన్రిక్‌ ఓ వార్తాసంస్థకు వెల్లడించాడు. ‘ముందుగా మెల్‌బోర్న్‌లోని బార్‌ల వివరాలు సేకరించాం. ఈ మేరకు ఓ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశాం. గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కేందుకు అవసరమైన సాక్ష్యాలు నమోదు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గిన్నిస్‌ నిబంధనల ప్రకారం.. సందర్శించిన ప్రతి పబ్‌లో 125 మిల్లీలీటర్ల డ్రింక్‌ మాత్రమే తీసుకున్నాం’ అని హెన్రిక్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని