America: యుద్ధ లక్ష్యాల్లో రష్యా విఫలం.. ఉక్రెయిన్‌దే విజయం..!

సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. తన యుద్ధ లక్ష్యాలలో విఫలమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు.

Updated : 25 Apr 2022 13:55 IST

ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల భేటీ

కీవ్‌: సైనికచర్య పేరుతో ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా.. తన యుద్ధ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా సైనిక చర్యను దీటుగా ఎదుక్కొంటున్న ఉక్రెయిన్‌ మాత్రం ఈ యుద్ధంలో విజయం సాధిస్తోందన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా తోడుగా ఉంటుందన్న ఆయన.. మరింత సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో కలిసి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన తర్వాత ఆంటోని బ్లింకెన్‌ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమై రెండు నెలలు పూర్తికాగా, ఈ సమయంలో అమెరికా అగ్రనేతలు ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు మరింత సహాయాన్ని అందిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. 300 మిలియన్‌ డాలర్ల విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్‌తోపాటు 165 మిలియన్‌ డాలర్ల విలువైన మందుగుండు సామగ్రి ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అగ్రనేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు తమ పూర్తి మద్దతు లభిస్తుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఈ పర్యటన అవకాశం కల్పించదన్నారు. భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా దూకుడును అడ్డుకుంటూ అసాధారణ ధైర్యంతో ఉక్రెయిన్‌ సైన్యం ముందుకు వెళ్లడాన్ని ఆంటోని బ్లింకెన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సేనలను ముందుండి నడిపిస్తోన్న నాయకత్వం, సాధిస్తోన్న విజయాలను అమెరికా విదేశాంగమంత్రి కొనియాడారు.

ఇక ఉక్రెయిన్‌ ప్రతిఘటనను ప్రశంసించిన అమెరికా రక్షణమంత్రి ఆస్టిన్‌.. ఈ యుద్ధంలో ఆ దేశం తెగువను చూసి యావత్‌ ప్రపంచం స్ఫూర్తి పొందుతోందన్నారు. ముఖ్యంగా రాజధాని కీవ్‌ నుంచి రష్యా సైనికులను తిప్పికొట్టడంలో అసాధారణ పోరాట పటిమ కనబరచినట్లు పేర్కొన్నారు.

రష్యా సైనిక చర్యతో కీవ్‌ నుంచి రాయబార కార్యాలయాన్ని పొలండ్‌కు తరలించిన అమెరికా.. తిరిగి తమ దౌత్యవేత్తలను కీవ్‌కు తరలించే ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్‌లో మొదలుపెట్టి ఇతర నగరాల్లో తమ దౌత్యవేత్తలు రోజూవారీగా పర్యటిస్తారని చెప్పారు. అనంతరం పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ రాజధానికి తిరిగి చేరుకునేలా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా పేర్కొంది.

ఇదిలాఉంటే, రక్షణ పరికరాల రూపంలో ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు బ్రిటన్‌ కూడా ముందుకొచ్చింది. డ్రోన్లు, సురక్షితంగా సైనికుల కదలికలకు ఉపయోగపడే వాహనాలను సమకూరుస్తామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా త్వరలోనే కీవ్‌లో తమ దౌత్య కార్యాలయాన్ని కూడా తెరుస్తామన్న బోరిస్.. ఉక్రెయిన్‌లో ఆకృత్యాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని