Boris Johnson: ‘మొసలి’ వంటి పుతిన్‌తో చర్చలు జరపడమంటే కష్టమే!

ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలుకుతుందని చెప్పలేమని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

Published : 22 Apr 2022 01:19 IST

ఉక్రెయిన్‌ - రష్యా చర్చలపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు దొరుకుతుందని చెప్పలేమని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడితో చర్చలు జరపడమంటే మొసలితో సంప్రదింపులు జరిపినట్లేనని బోరిస్‌ అభిప్రాయపడ్డారు. భారత పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో అక్కడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య జరుగుతోన్న శాంతి చర్చల పురోగతిపై ఈ విధంగా స్పందించారు.

‘ఉక్రెయిన్‌ను చుట్టిముట్టి స్వాధీనం చేసుకోవాలని పుతిన్‌ భావిస్తున్నట్లు ఆయన వ్యూహాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో చిత్తశుద్ధి లేనప్పుడు పుతిన్‌తో ప్రస్తుతం చర్చలు జరపడం ఉక్రెయిన్‌కు కష్టమే. మీ కాలు మొసలి (పుతిన్‌ను పోల్చుతూ) దవడలో చిక్కుకుపోయినప్పుడు దానితో చర్చలు ఎలా జరుపుతారు? అంటూ బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడారు. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం అత్యంత అవసరమని అన్నారు. అందుకే ఉక్రెయిన్‌కు బ్రిటన్‌తోపాటు మిగత నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేసే ప్రణాళికను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ రష్యాకు చిత్తశుద్ధి లేనందున అవి విఫలమవుతూనే ఉన్నాయని బ్రిటన్‌ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కీవ్‌ను వశం చేసుకోవడంలో ఇప్పటికే ఒకసారి విఫలమైన రష్యా.. రాజధానిపై మరోసారి మెరుపుదాడి చేసే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులను మరోసారి ముమ్మరం చేసినందున ఉక్రెయిన్‌కు అండగా నిలవడంలో భాగంగా అమెరికాతోపాటు ఇతర దేశాధినేతలు ఈ వారంలో మరోసారి చర్చించేందుకు అంగీకరించారని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌ ఉక్రెయిన్‌ అంశాన్నీ ప్రధాని మోదీతో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని