Pakistan: మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తాం.. పాక్‌ ప్రధాని హామీ

దివాలా అంచున ఉన్న పాకిస్థాన్‌ ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అక్కడి అభివృద్ధి పనులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Updated : 02 Feb 2024 10:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్‌ (Pakistan) ఇప్పుడు మాల్దీవులకు సాయం చేస్తామంటూ ప్రకటించింది. గురువారం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, పాక్‌ ప్రధాని అన్వర్‌ ఉల్‌హక్‌ కాకర్‌ ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రాధాన్యాలు, అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాలను చర్చించుకున్నారు. మాల్దీవుల అభివృద్ధికి అవసరమైన సాయం తాము అందిస్తామని పాక్‌ ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారు. 1966లో తొలిసారి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. మరో వైపు ఇస్లామాబాద్‌-బీజింగ్‌ మధ్య బలమైన అనుబంధం ఉంది.

పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు

తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్‌ ఇటీవలే 2 బిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వాలని డ్రాగన్‌ను కోరింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాని అన్వర్‌ చైనా ప్రీమియర్‌ లి క్వియాంగ్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్‌ వృద్ధిరేటు పెరుగుదల అంచనాల్లో ఐఎంఎఫ్‌ 2 శాతం కోత విధించింది. ఇక పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ను విక్రయించి కొంత ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

బడ్జెట్‌లో కోత..

తాజాగా భారత తాత్కాలిక బడ్జెట్‌లో మాల్దీవులకు ఏటా కేటాయించే సాయంలో కోత విధించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.600 కోట్లు మంజూరు చేశారు. 2023-24లో ఇది రూ.770.90 కోట్లుగా ఉంది. తొలుత దీనిని రూ.400 కోట్లకే పరిమితం చేయగా.. తర్వాత పునఃసమీక్షించి పెంచారు. ఇక 2022-23లో రూ.183 కోట్లు మాత్రమే ఇచ్చారు. కొన్నేళ్లగా భారత్‌ ఆ దేశానికి అత్యధిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా రక్షణ, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనలో న్యూదిల్లీ సహకారం అందిస్తోంది. ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో తాజాగా సాయంలో కోత పడింది. 

భారత్‌ ఒక్క మాల్దీవులకే కాదు పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు అభివృద్ధి సాయాన్ని ఇచ్చింది. ఈ సారి బడ్జెట్‌లో ఇందుకోసం రూ.2,068 కోట్లు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని