Isarel- Hamas: ఇజ్రాయెల్‌పై దాడి.. బ్రిటన్‌లో సంబరాలు చేసుకున్న హమాస్‌ మద్దతుదారులు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. ఈ చర్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.

Updated : 08 Oct 2023 17:36 IST

లండన్‌: ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. భారత్‌ సహా బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హమాస్‌ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్‌ వీధుల్లో సంబరాలు చేసుకుంటూ కనిపించారు. దీనిపై లండన్‌ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందించారు. 

‘‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి మద్దతుగా కొందరు లండన్‌ వీధుల్లో సంబరాలు చేసుకుంటున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయొచ్చు. లండన్‌ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించం. అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసు గస్తీని పెంచాం’’ అని లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వీడియోలు చూసిన నెటజన్లు హమాస్‌ మద్దతుదారుల తీరుపై మండిపడుతున్నారు. ‘‘ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారు. అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. యూరప్‌లో చాలా మంది యూదులపై మాత్రమే దాడి జరుగుతుందనుకుంటున్నారు. హమాస్‌ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వం’’ అని ట్వీట్లు చేస్తున్నారు. 

ఇజ్రాయెల్‌పై మరోవైపు నుంచి హెజ్బొల్లా దాడులు ప్రారంభం..!

ఇజ్రాయెల్‌కు పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌కు మధ్య జరుగుతున్న భీకర పోరులో మృతుల సంఖ్య పెరిగిన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 300 దాటగా.. 1500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హమాస్‌ దాడులపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో అక్కడ 300 మందికిపైగా ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని