ChatGPT: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ‘చాట్‌జీపీటీ’ పరిష్కారం.. ఏం చెప్పిందంటే..?

మరి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారుతున్న రష్యా సైనికచర్యను కృత్రిమ మేధ ఆపగలదా? ఈ యుద్ధానికి (Russia Ukraine War) చాట్‌జీపీటీ (ChatGPT) సూచించిన మధ్యవర్తిత్వ పరిష్కారమేంటీ..?

Updated : 11 Mar 2023 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) గురించి రోజుకో వార్త వైరల్‌ అవుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)తో పనిచేసే ఈ టూల్‌.. ఎలాంటి ప్రశ్నకైనా ఆసక్తికర బదులిస్తోంది. దీంతో చాట్‌జీపీటీ(ChatGPT)తో పలువురు సంభాషణలు జరిపి, సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ కూడా ఈ జాబితాలో చేరారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Russia Ukraine War)లో మధ్యవర్తిత్వ ప్రణాళిక గురించి ఆయన చాట్‌బోట్‌ను అడగ్గా.. చాట్‌జీపీటీ సుదీర్ఘ సమాధానమిచ్చింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారుతున్న రష్యా సైనికచర్యను కృత్రిమ మేధ ఆపగలదా? ఈ యుద్ధానికి (Russia Ukraine War) చాట్‌జీపీటీ ఇచ్చిన పరిష్కారమేంటీ..?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Russia Ukraine War)లో మధ్యవర్తిత్వ ప్రణాళికను సూచించాలని వికాస్‌ స్వరూప్‌ ఇటీవల చాట్‌బోట్‌ (Chatbot)ను అడిగారు. దీనికి చాట్‌జీపీటీ (ChatGPT) 8 పాయింట్లలో ‘సాధ్యమయ్యే’ పరిష్కారాన్ని సూచించింది. ‘‘ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఘర్షణలు చాలా క్లిష్టమైనవి, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నవి. దీనిపై ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కాస్త సవాలుతో కూడుకున్నదే. అయితే, చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాలు ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహకారం, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించడం, సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ: ఈ ఎనిమిది అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశముంది’’ అని చాట్‌జీపీటీ (ChatGPT) సమాధానమిచ్చింది. ఈ జవాబును వికాస్‌ స్వరూప్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

గొప్ప ప్రయత్నం: శశి థరూర్‌

అయితే, ఈ ట్వీట్‌కు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) తాజాగా స్పందిస్తూ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. ‘‘వికాస్‌ స్వరూప్‌ చొరవ ఆసక్తికరమైనదే. కానీ, ఆ ఇరు దేశాధినేతలు(పుతిన్‌, జెలెన్‌స్కీని ఉద్దేశిస్తూ).. కృత్రిమ మేధ అంచనాలకు మించి ప్రవర్తించేవారు. ఈ ప్రత్యేక కేసులో (యుద్ధం గురించి).. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానంపై ఇరు దేశాల నుంచి అభ్యంతరాలు రావొచ్చు. ముఖ్యంగా రష్యన్ల నుంచి. అయితే ఇదే గొప్ప ప్రయత్నం’’ అని థరూర్‌ రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు