Ukraine-Crisis | తైవాన్‌ మాదే.. ఉక్రెయిన్‌తో పోలికేంటి..?: చైనా

తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ఎప్పుడూ ఇష్టపడని చైనా.. దాన్ని ఉక్రెయిన్‌తో పోల్చడాన్ని ఖండించింది. రెండింటికీ చాలా తేడా ఉందని, తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పేర్కొంది.

Published : 24 Feb 2022 01:31 IST

బీజింగ్‌: తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ఎప్పుడూ ఇష్టపడని చైనా.. దాన్ని ఉక్రెయిన్‌తో పోల్చడాన్ని ఖండించింది. రెండింటికీ చాలా తేడా ఉందని, తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పేర్కొంది. ఉక్రెయిన్‌ తరహాలో తైవాన్‌పైనా కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయన్న తైవాన్‌ అధ్యక్షుడి త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.

‘‘తైవాన్‌ ఎప్పటికీ ఉక్రెయిన్‌ కాదు. తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఉక్రెయిన్‌, తైవాన్‌ను పోల్చడం అంటే.. తైవాన్‌ సమస్య విషయంలో కనీస  ప్రాథమిక అవగాహన లేదనే అనుకోవాలి’’ అని హువా పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడబోమని, అవసరమైతే సైన్యాన్ని వినియోగించైనా అంతర్భాగం చేసుకోవడానికి చైనా వెనుకాడబోదని చెప్పారు.

అంతకుముందు తైవాన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ... ఉక్రెయిన్‌లో పరిస్థితులు తారుమారు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే తరహాలో తైవాన్‌ను దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు యత్నిస్తున్నాయంటూ చైనా పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలా ఉక్రెయిన్‌ను, తైవాన్‌ను పోల్చడంపై చైనా ఈ విధంగా స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని