New Zealand: పొగాకు అమ్మకాల నిషేధంపై వెనక్కి.. విమర్శలపాలవుతున్న న్యూజిలాండ్‌ కొత్త ప్రధాని నిర్ణయం

గతంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని న్యూజిలాండ్‌ కొత్త ప్రధాని నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 27 Nov 2023 16:30 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ (New Zealand)లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్రిస్టోఫర్‌ లుక్సన్‌ (Christopher Luxon) తెలిపారు. ఆయన నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తప్పుపడుతున్నారు. సోమవారం న్యూజిలాండ్ 42వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే తన మొదటి ప్రాధాన్యతని తెలిపారు.

ఈ క్రమంలోనే పొగాకు ఉత్పత్తులపై గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. గతంలో న్యూజిలాండ్‌ను పొగాకు రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని జెస్సిండా ఆర్డెర్న్‌.. ‘జనరేషనల్‌ స్మోకింగ్ బ్యాన్‌’ పేరుతో 2008 తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడంపై నిషేధం విధించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ వర్గాలు, ధూమపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాదులు స్వాగతించారు.

ఈ నిషేధాన్ని కొత్త ప్రధాని క్రిష్టోఫర్ తొలగించనున్నారు. ‘‘పొగాకు ఉత్పత్తులపై నిషేధం వల్ల దేశంలో బ్లాక్‌ మార్కెట్‌ విస్తరించే ప్రమాదం ఉంది. జనరేషన్‌ స్మోకింగ్‌ బ్యాన్‌లోని అంశాలతో నేను ఏకీభవించను. గత 30 ఏళ్లలో దేశ వ్యాప్తంగా ధూమపానం చేసే వారి సంఖ్య తగ్గింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం తొలగించినా.. ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంపై ఆరోగ్యశాఖ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పొగాకు పరిశ్రమల విజయమని, దేశానికి అవమానమని మండిపడుతున్నారు. బ్రిటన్‌ కూడా తమ దేశాన్ని 2030 నాటికి పొగ రహితంగా మార్చేందుకు.. భవిష్యత్తు తరాలు సిగరెట్లు వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

న్యూయార్క్‌లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్‌(Jacinda Ardern) రాజీనామా చేశారు. అనంతరం క్రిస్‌ హిప్‌కిన్స్‌ న్యూజిలాండ్ 41వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో పది నెలల తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో న్యూజిలాండ్ 42వ ప్రధానిగా రెండు చిన్నపార్టీల మద్దతుతో నేషనల్‌ పార్టీ అభ్యర్థి క్రిస్టోఫర్‌ లుక్సన్‌ ప్రమాణస్వీకారం చేశారు. పన్ను రాయితీ, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 100 రోజుల ప్రణాళిక, రెండేళ్లలో 500 మంది పోలీసుల నియామకం వంటి హామీలతో క్రిస్టోఫర్‌ ప్రధాని పదవి చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన పొగాకు ఉత్పత్తులపై ఉన్న నిషేధం తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని