Ukraine Crisis: ల్యాండ్‌మైన్లను తొలగించేందుకు ఏడేళ్ల సమయం పడుతుంది.. ఉక్రెయిన్‌ మంత్రి హకోప్యాన్‌

సైనిక చర్య మొదలు ఉక్రెయిన్‌ భూభాగంపై రష్యా బలగాలు విధ్వంసాన్ని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. క్షిపణులు, ఫిరంగులతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు కలగజేస్తున్నాయి. సేనల ఉపసంహరణ క్రమంలోనూ పెద్దఎత్తున ల్యాండ్‌మైన్లు అమర్చి...

Published : 21 May 2022 14:02 IST

కీవ్‌: సైనిక చర్య మొదలు ఉక్రెయిన్‌ భూభాగంపై రష్యా బలగాలు విధ్వంసాన్ని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. క్షిపణులు, ఫిరంగులతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు కలగజేస్తున్నాయి. సేనల ఉపసంహరణ క్రమంలోనూ పెద్దఎత్తున ల్యాండ్‌మైన్లు అమర్చి.. మరింత వినాశనానికి యత్నించినట్లు స్థానిక అధికారులు పలు సందర్భాల్లో ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పేరుకుపోయిన ల్యాండ్‌మైన్లను తొలగించేందుకు కనీసం అయిదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని దేశ ఉప అంతర్గత వ్యవహారాల మంత్రి మేరీ హకోప్యాన్ తాజాగా వెల్లడించారు. సుమారు మూడు లక్షల చదరపు మీటర్ల మేర ప్రాంతం యుద్ధ అవశేషాలతో నిండిపోయిందని తెలిపారు. ఉక్రెయిన్‌లో మందుపాతరల తొలగింపునకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమన్వయ కేంద్రం మొదటి సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రసంగించారు.

ల్యాండ్‌మైన్‌ల తొలగింపు ప్రక్రియను మరింత సమర్థంగా చేపట్టేందుకు తాము అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తున్నట్లు హకోప్యాన్ తెలిపారు. ‘మైన్ క్లియరింగ్ మిషన్‌’ను నిర్వహించే విషయమై కీవ్ తన విదేశీ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని చెప్పారు. యుద్ధం మొదలు ఇప్పటివరకు 1.14 లక్షల పేలుడు పదార్థాలను వెలికితీసినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ ఉప అధిపతి ఇహోర్ జోవ్క్వా మాట్లాడుతూ.. తమ దేశంలో మందుపాతరల తొలగింపు చర్యలకు ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. వెనక్కి వెళ్తోన్న రష్యన్ బలగాలు పెద్ద ఉపద్రవాన్నే సృష్టించి వెళ్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గతంలో తమ దేశ పౌరులను హెచ్చరించిన విషయం తెలిసిందే. తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని