India at UN: శాంతిని కోరుకునేవారే అయితే.. ముష్కరులకు ఆశ్రయమిస్తారా?

అంతర్జాతీయ వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్‌కు దిల్లీ దీటుగా బదులిచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే

Published : 25 Sep 2022 01:37 IST

ఐరాసలో పాక్‌ ‘శాంతి’ మాట.. దీటుగా బదులిచ్చిన భారత్‌

యునైటెడ్‌ నేషన్స్‌: అంతర్జాతీయ వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్‌కు దిల్లీ దీటుగా బదులిచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని దుయ్యబట్టింది. ముంబయి పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ.. శాంతికాముకులెవరూ ఆ భీకర దాడికి కుట్రలు పన్నిన వారికి ఆశ్రయం ఇవ్వబోరని మండిపడింది.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ మాట్లాడుతూ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్‌ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. షరీఫ్‌ వ్యాఖ్యలకు భారత్‌  గట్టిగానే సమాధానమిచ్చింది.

ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. ‘‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన(షరీఫ్‌ను ఉద్దేశిస్తూ) ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఆయన చెబుతున్నారు. అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. భారత్‌లోని ముంబయిలో భీకర ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’’ అని పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు.

శాంతి, భద్రత, పురోగతిని మాత్రమే తాము కోరుకుంటున్నామని, సీమాంతర ఉగ్రవాదం ఆగిపోయినప్పుడే అది కచ్చితంగా జరుగుతుందని భారత్‌ తెలిపింది. పాకిస్థాన్‌తో ఉగ్ర, హింస రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్‌ కాంక్షిస్తోందని పేర్కొంది. అయితే జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామే అనే విషయాన్ని ఐరాస వేదికగా పాక్‌కు మరోసారి స్పష్టంగా చెప్పింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని