Covid 19: కరోనా వైరస్‌ చైనా నిర్మితమే.. .. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకయ్యింది: అమెరికా శాస్త్రవేత్త

కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన కొవిడ్‌-19 వైరస్‌ మానవ నిర్మితమైందంటూ అమెరికాకు చెందిన ఓ ప్రముఖ అంటువ్యాధుల నిణుపుడు పేర్కొన్నారు. వుహాన్‌ ల్యాబ్‌లో గతంలో పనిచేసిన ఆయన.. అందుకు సంబంధించిన వివరాలతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తక సారాంశంతో అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి.

Updated : 06 Dec 2022 08:11 IST

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19 మూలాలపై (Covid Origin)మూడేళ్లయినా ఇంకా మిస్టరీ వీడలేదు. చైనాలోని వుహాన్‌లో తొలుత బయటపడిన ఈ వైరస్‌కు సంబంధించిన మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఫలితం మాత్రం తేలలేదు. ఈ క్రమంలోనే.. కొవిడ్‌ మానవ నిర్మిత వైరసేనంటూ ఓ ప్రముఖ అమెరికన్‌ ఎపిడమాలజిస్ట్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు. గతంలో వుహాన్‌ ల్యాబ్‌లో (Wuhan Lab) పనిచేసిన ఆయన.. అక్కడి నుంచే వైరస్‌ లీకయ్యిందంటూ బహిరంగపరచడం చర్చనీయాంశమయ్యింది.

‘ది ట్రూత్‌ అబౌట్‌ వుహాన్‌’ అనే పేరుతో అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు (Epidemiologist) ఆండ్రూ హఫ్స్‌ తాజాగా ఓ పుస్తకాన్ని రాశారు. ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (WIV) నుంచే కొవిడ్‌ లీకయ్యింది’ అంటూ ఆ పుస్తక సారాంశాన్ని బ్రిటన్‌కు చెందిన ‘ది సన్‌’ పత్రిక ప్రచురించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ది న్యూయార్క్‌ పోస్టు కూడా ఓ కథనాన్ని రాసింది. వైరస్‌లపై పరిశోధనలు జరిపే క్రమంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయ్యిందని ఆండ్రూ హఫ్స్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది.

ముఖ్యంగా విదేశీ ల్యాబ్‌లలో బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అవసరమైన నియంత్రణ చర్యలు లేకపోవడం.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకవడానికి దారితీసిందని హఫ్స్‌ చెప్పినట్లు తెలిపింది. ‘కొవిడ్‌-19 జన్యుపరంగా తయారు చేసిందేనని చైనాకు మొదటినుంచీ తెలుసు. అక్కడి పరిస్థితులు చూసి ఎంతో భయపడిపోయా. ‘మనమే ఈ ప్రమాదకర జీవాయుధ సాంకేతికతను చైనాకు బదిలీ చేస్తున్నాం’ అని అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆండ్రూ అందులో వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అంటువ్యాధులపై అధ్యయనం చేసే స్వచ్ఛంద సంస్థ, న్యూయార్క్‌లోని ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’కు ఆండ్రూ హఫ్స్‌ గతంలో (2014-16 మధ్య కాలంలో) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై ఈ సంస్థ శతాబ్దానికి పైగా అధ్యయనం చేస్తోంది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (NIH) నిధులు సమకూర్చే ఈ సంస్థ.. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేసింది. అయితే, కొవిడ్‌ బయటపడిన సమయంలో వుహాన్‌ ల్యాబ్‌పై ఎన్నో ఆరోపణలు రావడంతో ట్రంప్‌ హయాంలో దానికి నిధులను నిలిపివేశారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని