UKriane Crisis: రష్యాపై పోరుకు నాటో దిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే

రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఆ పరిణామాలను నివారించేందుకే

Updated : 12 Mar 2022 14:36 IST

హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ 

వాషింగ్టన్‌: రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే గనుక, అందుకు క్రెమ్లిన్‌ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. 

‘‘ఐరోపాలో అమెరికా మిత్రదేశాలకు మా సహాయం ఎప్పటికీ కొనసాగుతుంది. నాటో దేశాల భూభాగాల్లోని ప్రతి అంగుళాన్ని పరిరక్షించుకుంటాం. కానీ, ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా మేం నేరుగా యుద్ధానికి దిగబోం. ఎందుకంటే నాటో రంగంలోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. అయితే ఉక్రెయిన్‌లో రష్యా ఎన్నటికీ విజయం సాధించలేదు. ఎలాంటి పోరాటం లేకుండానే ఉక్రెయిన్‌పై ఆధిపత్యం సాధించగలమని పుతిన్‌ అనుకున్నారు. కానీ ఆయన విఫలమయ్యారు. నాటో కూటమిలో విభేదాలు తీసుకొచ్చి దాన్ని బలహీనపరచాలన్న ఆయన కుట్రలు కూడా ఫలించలేదు’’ అని బైడెన్ వౌట్‌హౌస్‌ వద్ద విలేకరులతో అన్నారు. 

రష్యా సరిహద్దులకు 12వేల అమెరికా బలగాలు..

ఇదిలా ఉండగా.. లాత్వియా, ఇస్తోనియా, లిథువేనియా, రొమేనియా వంటి దేశాల్లో రష్యా సరిహద్దులకు 12వేల మంది అమెరికా బలగాలను పంపినట్లు జో బైడెన్‌ వెల్లడించారు. ‘‘ఐరోపాలోని మా మిత్ర దేశాలకు మేం ప్రమాదకర ఆయుధాలు, విమానాలు, యుద్ధ ట్యాంక్‌లను పంపుతున్నాం. అమెరికన్‌ పైలట్లు, సిబ్బందిని కూడా పంపబోతున్నాం. అంటే మీరే అర్థం చేసుకోండి’’ అని రష్యాను ఉద్దేశిస్తూ బైడెన్‌ వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల కారణంగా రష్యా ఇప్పటికే భారీగా నష్టపోయిందని బైడెన్‌ అన్నారు. ఒకవేళ ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు వినియోగిస్తే ఆ దేశం మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని