‘టేకాఫ్‌ కష్టం.. కొందరు దిగిపోండి!’.. ప్రయాణికులకు వింత అనుభవం

ఈజీ జెట్‌ విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ప్రతికూల వాతవరణ పరిస్థితుల కారణంగా టేకాఫ్‌ కష్టమని భావించి కొందరు ప్రయాణికులను ఆ సంస్థ దించివేసింది.

Updated : 08 Jul 2023 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతికూల వాతావరణం. అప్పటికే అనుకున్న షెడ్యూల్‌ దాటిపోయింది. విమానం టేకాఫ్‌ అవ్వడానికి పైలట్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేసేదిలేక కొందరు ప్రయాణికులను విమాన సిబ్బంది దించివేశారు. స్పెయిన్‌లోని లాంజ్రోట్‌ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఈ వింత అనుభవం ఎదురైంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటికొచ్చింది.

బ్రిటన్‌కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్‌ (EasyJet) స్పెయిన్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్లాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 9.45 గంటలకు ఈ విమానం షెడ్యూల్‌ ప్రకారం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆలస్యమైంది. దీంతో ఆలస్యానికి గల కారణాన్ని ఈజీ జెట్‌ పైలట్‌ ప్రయాణికులకు వివరించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం ఆలస్యమవుతోందని పైలట్‌ పేర్కొన్నాడు. విమానాశ్రయం రన్‌వే పొడువు సైతం తక్కువగా ఉండడం వల్ల టేకాఫ్‌ కష్టమవుతోందని వివరించాడు. 

ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానం టేకాఫ్‌ కష్టమని పైలట్‌ చెప్పాడు. కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని విరమించుకుంటేనే టేకాఫ్‌ సాధ్యమని తెలిపాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 పౌండ్లు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని