Georgia: జార్జియా పార్లమెంటులో రచ్చ.. ఎంపీల ముష్టియుద్ధం!

ఓ వివాదాస్పద ముసాయిదా చట్టం చర్చ సమయంలో జార్జియా (Georgia) పార్లమెంటు రణరంగంగా మారింది. చట్టసభ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతోపాటు ముష్టియుద్ధానికి దిగారు.

Published : 07 Mar 2023 01:29 IST

తబ్లిసి: జార్జియా (Georgia) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. వివాదాస్పదంగా మారిన ఓ చట్టంపై చర్చిస్తోన్న సమయంలో పార్లమెంటు సభ్యుల (MPs) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఎంపీలు ముష్టియుద్ధానికి (Fistfight) దిగడంతో సభ హింసాత్మకంగా మారినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంస్థలకు వచ్చే నిధుల్లో 20శాతం కంటే ఎక్కువ విదేశాల నుంచి వచ్చినట్లయితే  అవి ‘విదేశీ ఏజెంట్ల’ కింద రిజిస్టర్‌ చేసుకునేలా జార్జియా ప్రభుత్వం ఓ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ ముసాయిదా అనుమతి కోసం వివిధ విభాగాలకు ప్రభుత్వం ఇదివరకే పంపించింది. దీన్ని అక్కడి విపక్షాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యాలోని అత్యంత దారుణమైన ఓ చట్టం ఆధారంగానే దీన్ని రూపొందించారని ఆరోపించారు.

ఈ వివాదాస్పద ముసాయిదా చట్టంపై పార్లమెంటులో సోమవారం చర్చ జరిగింది. అదే సమయంలోనే  దాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరసనకారులు పార్లమెంటు బయట ధర్నా చేపట్టారు. దీనిపై చర్చించే సమయంలో రెచ్చిపోయిన చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై స్పందించిన జార్జియా అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి ఈ చట్టాన్ని వీటో చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని