Antony Fauci: నాలుగో డోసు.. ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా...

Updated : 11 Feb 2022 06:01 IST

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో నాలుగో డోసు అవసరంపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై డా.ఫౌచీ స్పందిస్తూ.. ఈ అంశాన్ని దగ్గరి నుంచి గమనిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి మరొక బూస్టర్‌ అవసరం ఉండొచ్చని చెప్పారు. ఒమిక్రాన్‌ను డబ్ల్యూహెచ్‌వో ‘ఆందోళనకర వేరియంట్‌’గా ప్రకటించినప్పటి నుంచి అగ్ర రాజ్యంలో సుమారు లక్ష మరణాలు సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగో డోసుపై ఫౌచీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

నవంబర్‌లో ఒమిక్రాన్ బయటపడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల మంది కరోనాతో మరణించారని డా.ఫౌచీ ఇది వరకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని మహమ్మారి పూర్తిగా విస్తరించిన దశగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా.. వైరస్‌ ఉద్ధృతి గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ తదితర రాష్ట్రాలు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, పాఠశాలల్లో మాస్క్ వినియోగాన్ని కొనసాగించాలన్న సీడీసీ మార్గదర్శకాలకు తాము కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఇటీవల తెలిపింది. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనూ పౌరులు మాస్క్ ధరించాలని సీడీసీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని