Updated : 06 Feb 2022 06:32 IST

Covid 19: కొత్తవేరియంట్‌ పుట్టుకను ముందే తెలుసుకోవచ్చు

అమెరికా శాస్త్రవేత్తల కీలక పరిశోధన 
మురుగునీటి విశ్లేషణే కీలకం  

ఆల్ఫా.. బీటా.. డెల్టా.. ఒమిక్రాన్‌.. ఇలా కరోనాలో కొత్త రకాలు పుట్టుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాప్తి చెందుతున్నాయి. తదుపరి కొత్త వేరియంట్‌ ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియక అందరూ అయోమయానికి గురవుతున్నారు. దీనిపై శాస్త్రవేత్తల్లోనూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తదుపరి ఆందోళనకర వేరియంట్ల రాకను ముందే గుర్తించే దిశగా ముందడుగు పడింది.

ఉత్పరివర్తనాలకు లోనుకావడం ద్వారా కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటుంది. డెల్టా లేదా ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉంటాయి. ఈ వైరుధ్యాల ఆధారంగా ఆ వేరియంట్లను నిర్దిష్టంగా గుర్తిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో.. తర్వాతి వైరస్‌ రకంపై అమెరికా పరిశోధకులు దృష్టిసారించారు. 

కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావాన్ని మదించడానికి శాస్త్రవేత్తలు భిన్న మార్గాలను అన్వేషించారు. మురుగునీటిని పరిశీలించడం ద్వారా వైరస్‌ వ్యాప్తి తీరును తెలుసుకోవచ్చని ఇప్పటికే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ సూత్రం ఆధారంగా న్యూయార్క్‌కు చెందిన క్వీన్స్‌బరో కమ్యూనిటీ కాలేజీకి చెందిన మోనికా ట్రూజిలో పరిశోధన చేపట్టారు. న్యూయార్క్‌ నగరంలోని పలు మురుగునీటి కేంద్రాల నుంచి వ్యర్థ జలాలను తెప్పించుకొని విశ్లేషణ జరిపారు.

 పరిశోధనలో తేలిన అంశాలివీ..

రోగుల విసర్జితాల్లోని కరోనా వైరస్‌ వ్యర్థ జలాల్లోకి చేరుతుంది. దాన్ని ఆర్‌టీ-క్యూపీసీఆర్‌ ద్వారా గుర్తించొచ్చు. ఈ విధానంలో న్యూయార్క్‌ నగరంలోని 14 మురుగునీటి కేంద్రాల నమూనాల్లో ఆల్ఫా, బీటా, ఎప్సిలాన్, అయోటా, డెల్టా, కప్పా, గామా వేరియంట్లను గుర్తించారు. 

వీటితోపాటు ఇప్పటివరకూ బహిర్గతం కాని కొన్ని ప్రత్యేక ఉత్పరివర్తనాలతో కూడిన వైరస్‌ రకాలను గుర్తించారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లకు ఇవి భిన్నంగా ఉన్నాయి. కరోనా జన్యుక్రమాల వివరాలను భద్రపరుస్తున్న ‘జీఐఎస్‌ఏఐడీ ఎపికోవ్‌ డేటాబేస్‌’లో ఇవి లేవు. వీటిలోని కొన్ని ఉత్పరివర్తనాలు.. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు దగ్గరగా ఉన్నాయి. వీటిని ‘నిగూఢ రకాలు’గా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. 

ఎక్కడి నుంచి వచ్చాయి?

ఈ కొత్త వైరస్‌ రకాల మూలాలను శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేదు. అవి జంతువుల నుంచి వచ్చి ఉండొచ్చని అంచనావేస్తున్నారు. న్యూయార్క్‌ మురుగునీటి వ్యవస్థలో ఎక్కువగా తిరిగే ఎలుకల నుంచి అవి వెలువడి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సెయింట్‌ లూయీ నగరంలోని కొన్ని నమూనాల్లోనూ కొత్త ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఇవి న్యూయార్క్‌లో కనిపించిన రకాలకు భిన్నం. కానీ వాటన్నింటిలోనూ క్యూ498 అనే ప్రాంతంలో మార్పు కనిపించింది.

మానవులకు ముప్పు ఉందా?

ఈ నిగూఢ ఉత్పరివర్తనాల వల్ల మానవులకు ముప్పు ఉంటుందని చెప్పే నిర్దిష్ట ఆధారాలేమీ లేవు. భవిష్యత్‌లో కొవిడ్‌ ఏ రూపును సంతరించుకోనుందన్నది తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయి. వీటిపై పరిశోధనల ఆధారంగా తదుపరి ఆందోళనకర వేరియంట్‌ రాకను ముందే గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి తీరుతెన్నులను వేగంగా, చౌకలో గుర్తించడానికి వ్యర్థ జలాల పరిశోధన మెరుగైన విధానమని శాస్త్రవేత్తలు తెలిపారు.  

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని