పాక్‌లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని పాకిస్థాన్‌ మంత్రి ఖుర్రమ్‌ దస్త్‌గిర్‌ ప్రకటించారు.

Published : 25 Jan 2023 04:49 IST

అయినప్పటికీ కొనసాగుతున్న కోతలు

ఇస్లామాబాద్‌, వాషింగ్టన్‌: సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని పాకిస్థాన్‌ మంత్రి ఖుర్రమ్‌ దస్త్‌గిర్‌ ప్రకటించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సోమవారం దేశమంతా అంధకారంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నానికి కరెంటు ఉత్పత్తి, సరఫరా ప్రారంభమయిదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇస్లామాబాద్‌తో సహా దేశంలోని పలు చోట్ల విద్యుత్‌ కోతలు కొనసాగాయి. కొన్ని బొగ్గు, అణు విద్యుత్కేంద్రాలను రీస్టార్ట్‌ చేయడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతానికి పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దేశంలో ఇంధనకొరత లేదని మంత్రి ఖుర్రమ్‌ స్పష్టం చేశారు. తమ విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై పొరుగు దేశం హ్యాకింగ్‌కు పాల్పడి ఉంటుందన్న కోణంలోనూ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. అయితే అలా జరగడానికి అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలను క్షమాపణలు కోరుతున్నట్లు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. తమ ద్వారా చేయగలిగిన సాయం ఏమైనా ఉంటే చేస్తామని, పాక్‌ను ఆదుకుంటామని బైడెన్‌ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

అధికార పార్టీకి ఐఎమ్‌ఎఫ్‌ నిబంధనల భయం

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థను ఆశ్రయించిన పాక్‌ ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది. రుణం కావాలంటే పలు సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఐఎమ్‌ఎఫ్‌ తెగేసి చెప్పడమే దీనికి కారణం. దీంతో ప్రజల మద్దతు కోల్పోతామన్న అధికార ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పీఎమ్‌ఎల్‌-ఎన్‌)’ పార్టీ భయమే..  ఎన్నికల వరకు ఐఎమ్‌ఎఫ్‌తో చర్చలను సాగదీసేలా చేస్తోందని డాన్‌ పత్రిక మంగళవారం ఓ కథనం వెలువరించింది. విద్యుత్‌ రాయితీల రద్దు, అంతర్జాతీయ విపణితో గ్యాస్‌ ధరలను అనుసంధానించడం వంటి ఏడు నిబంధనలు పాక్‌కు ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రధాని త్వరగా చొరవతీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ప్రభుత్వంలోని అధికారులు ఆయనకు సూచించినట్లు కథనం వెల్లడించింది. ఇక్కడి సాధారణ ఎన్నికలు ఈ ఏడాది ఆగస్టు తర్వాత జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని