ఉక్రెయిన్‌లో అవినీతి ప్రక్షాళన

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారుల ప్రక్షాళనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చేపట్టారు.

Published : 25 Jan 2023 04:49 IST

డజను మందిపై వేటు

కీవ్‌: రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో అవినీతికి పాల్పడిన మంత్రులు, అధికారుల ప్రక్షాళనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ చేపట్టారు. లెపార్డ్‌-2 రకం యుద్ధ ట్యాంకుల్ని నాటోయేతర దేశమైన ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు జర్మనీ అనుమతిని పోలండ్‌ కోరిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా దేశాధ్యక్షుని కార్యాలయ ఉప అధిపతి కిరిలో టైమొషెంకో మంగళవారం రాజీనామా చేశారు. టైమొషెంకో విలాసవంతమైన కార్లను ఉపయోగించడంపై గత ఏడాది దర్యాప్తు జరిగింది. దక్షిణ జపోరిజియా ప్రాంతానికి ఉద్దేశించిన 70 లక్షల డాలర్ల మానవతా సాయంలో సింహభాగాన్ని స్వాహా చేశారని గత సెప్టెంబరులో ఆరోపణకు గురైన అధికారుల్లో ఆయన ఒకరు. ఉక్రెయిన్‌ సేనలకు ఆహారం కొనుగోలు కుంభకోణంలో రక్షణ శాఖ ఉపమంత్రి వ్యాచెస్లావ్‌ షాపోవలోవ్‌ ఇటీవల రాజీనామా చేశారు. ఉప ప్రాసిక్యూటర్‌ జనరల్‌ అలెక్సీ సైమొనెంకో, మౌలిక వసతుల శాఖ ఉపమంత్రి వాసిల్‌ లోజిన్‌స్కీ కూడా రాజీనామా చేసినవారిలో ఉన్నారు. రష్యా దాడులలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కాంట్రాక్టులు ఇవ్వడానికి 4 లక్షల డాలర్ల లంచం తీసుకొంటుండగా లోజిన్‌ స్కీ అరెస్టయ్యారు. ఒకపక్క రష్యాతో పోరు కొనసాగిస్తూనే మరోపక్క అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. యుద్ధం జరుగుతున్నంతమాత్రాన అవినీతిపై పోరు ఆగిపోదని స్పష్టం చేశారు. ఇంతవరకు నలుగురు డిప్యూటీ మంత్రులు, ఐదుగురు ప్రాంతీయ గవర్నర్లు తమ పదవుల్ని వదులుకోవాల్సి వస్తోంది.
* ప్రస్తుత కీలక తరుణంలో ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలను వేగంగా అందజేయాల్సిన అవసరం ఉందని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని