US-Financial crisis: దివాలా అంచున అమెరికా!

అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్‌ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి.

Updated : 18 May 2023 07:33 IST

డెమోక్రాట్లు, రిపబ్లికన్ల వైరం ఫలితం
ప్రభుత్వానికి డబ్బుల కటకట
అప్పు పరిమితి పెంపునకు  రిపబ్లికన్ల ససేమిరా  
ప్రమాదంలో 80 లక్షల కొలువులు, డాలర్‌ ఆధిపత్యం

అసలే మాంద్యం, ద్రవ్యోల్బణం, కొలువుల సమస్యలతో సతమతమవుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాను మరో ఆర్థిక బూచి భయపెడుతోంది. అదే జో బైడెన్‌ ప్రభుత్వ మెడపై వేలాడుతున్న దివాలా కత్తి. అప్పుల పరిమితిని పెంచడానికి కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఆమోద ముద్ర వేయకపోవడంతో అమెరికా ప్రభుత్వం డబ్బులకు కటకటలాడుతోంది. ఏకంగా అధ్యక్షుడు బైడెన్‌ కీలక ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏమిటీ అప్పులు?

ఆదాయం కంటే వ్యయం పెరిగినప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఇందుకోసం ప్రధానంగా బాండ్లు విడుదల చేస్తాయి. నిర్దిష్ట సమయంలో తిరిగి చెల్లించడమేగాకుండా.. అప్పటిదాకా వడ్డీ చెల్లిస్తామని హామీ ఇస్తాయి. అమెరికా అదే చేస్తోంది. అయితే ఏ దేశానికైనా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకోకుండా నియంత్రణ ఉండటం సహజం. వందేళ్ల కిందటే అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పులను కాంగ్రెస్‌ నియంత్రించింది. వీటిపై పరిమితి విధించింది. అవసరాల రీత్యా ఈ పరిమితిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని సవరించారు. ప్రతిసారీ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియే ఇది. కానీ అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈసారి పీటముడి బిగుసుకుని ఆర్థిక మంత్రే చేతులెత్తేసే స్థితికి చేరుకుంది.

జీడీపీ కంటే 29% ఎక్కువగా..

2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 ట్రిలియన్‌ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా సుమారు 7 ట్రిలియన్‌ డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. జపాన్‌, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంపునకు ససేమిరా అంటున్నారు. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ లేనట్లేనని, భవిష్యత్‌ ఖర్చులు తగ్గించుకోవాలని వాదిస్తున్నారు. బైడెన్‌తో రిపబ్లికన్ల చర్చలు సాగుతున్నా కొలిక్కి రావడం లేదు.

జూన్‌ ఒకటిలోపు ఏ క్షణమైనా..

మరోవైపు అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్‌ ఇప్పటికే చేతులెత్తేశారు. పరిమితి పెంచకుంటే జూన్‌ ఒకటోతేదీ లోపు ఏ క్షణమైనా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని ప్రకటించారు. అప్పుల పరిమితికి ప్రభుత్వం చేరుకుందంటే అదనంగా అప్పులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు, పన్నుల ద్వారా వచ్చే సొమ్మునే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం అప్పులు, వడ్డీలు, బిల్లులు తీర్చలేని పరిస్థితి వస్తుందో అది సాంకేతికంగా దివాలా తీసినట్లుగా భావిస్తారు.

అంతర్జాతీయంగా ప్రభావం..

అమెరికా చరిత్రలో ప్రభుత్వం చెల్లింపులు జరపలేని పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు. వస్తే ఇదే తొలిసారి అవుతుంది. అదే జరిగితే అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయి. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సైన్యానికి జీత భత్యాలు ఆగిపోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులపై ఆధారపడే అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రుణాలు, క్రెడిట్‌ కార్డులపై అధికంగా చెల్లించాల్సి వస్తుంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి... చివరికది భారీ నిరుద్యోగంతో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ‘అమెరికా తాత్కాలికంగా స్వల్పకాలానికి బిల్లులు చెల్లించలేని పరిస్థితి తలెత్తినా 80 లక్షల ఉద్యోగాలు పోతాయి. స్టాక్‌ మార్కెట్‌ 45శాతం కుప్పకూలుతుంది’ అని శ్వేతసౌధ వర్గాలు ఆందోళన వ్యక్తంజేయడం గమనార్హం. అన్నింటికీ మించి అమెరికా ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలుతుంది. ప్రపంచ ఆర్థిక రంగానికి ఇరుసుగా నడుస్తున్న డాలర్‌ ప్రాబల్యం ప్రమాదంలో పడుతుంది. చైనా కరెన్సీలాంటివి ప్రత్యామ్నాయాలుగా ఎదిగే అవకాశం ఉంది. అమెరికా ఆర్థికంగా బిల్లులు చెల్లించలేని తేదీ ఎప్పుడనేది ఇప్పుడందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎవరూ దీనిని కచ్చితంగా చెప్పలేరు. రుణ పరిమితి పెంచకుంటే బహుశా జూన్‌ 1 నుంచి ఆగస్టు 1లోపు ఈ అత్యయిక పరిస్థితి తలెత్తవచ్చనుకుంటున్నారు.


రుణ పరిమితిని కాంగ్రెస్‌ పెంచకుంటే.. అమెరికా మాంద్యాన్ని చవిచూస్తుంది. ఆ దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచంలో అమెరికా నాయకత్వం ప్ర£మాదంలో పడుతుంది. అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది

అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్‌


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు