విపత్తులతో దేశంలో 1.3 లక్షల మంది మృతి

దేశంలో 1970 నుంచి 2021 మధ్య సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.

Published : 23 May 2023 05:27 IST

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు 
50 ఏళ్ల గణాంకాలు వెల్లడించిన డబ్ల్యూఎంవో

జెనీవా, దిల్లీ: దేశంలో 1970 నుంచి 2021 మధ్య సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన 12 వేల విపత్తుల కారణంగా సుమారు 20 లక్షల మంది చనిపోయారని, రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని డబ్ల్యూఎంవో సోమవారం వెల్లడించింది. నాలుగేళ్లకోసారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సు ప్రారంభమైన సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది. 2027 లోపు విపత్తుల రాకపై హెచ్చరికల వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేసింది. డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌ పెట్టేరీ టాలస్‌ మాట్లాడుతూ.. ‘విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 1970-2021 మధ్య కాలంలో ఒక్క అమెరికాలోనే రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 10 మరణాల్లో 9 మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదయ్యాయి. ఇలాంటి విపత్తులకు బలహీన సమూహాలే ఎక్కువ నష్టపోతాయని తాజాగా బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికించిన మోచా తుపాను నిరూపించింది. అయితే ఒకప్పుడు ఇలాంటి తుపాన్లకు అక్కడ వందల మంది చనిపోయేవారు. హెచ్చరికల వ్యవస్థ మెరుగుపడటంతో అది పదుల సంఖ్యకు దిగి వచ్చింది. మనుషుల మరణాలకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణమవుతుండగా. వరదల వల్ల ఎక్కువగా ఆస్తి నష్టం సంభవిస్తోంది’ అని పేర్కొన్నారు. ఆసియాలో గత 50 ఏళ్ల కాలంలో 3,600 విపత్తులు ఏర్పడగా.. 9,84,263 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.11 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని