22న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.

Published : 03 Jun 2023 06:04 IST

భారత ప్రధాని గౌరవార్థం విందు ఇవ్వనున్న బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత్‌ భవిష్యత్తుకు సంబంధించి తన దృక్పథం, ప్రస్తుతం రెండు దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లు వంటి అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పలువురు అగ్రనేతలు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోదీ గౌరవార్థం అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌ 22వ తేదీన విందు ఇవ్వనున్నారు. ‘‘అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ల ద్వైపాక్షిక నాయకత్వం తరఫున ఈ నెల 22న కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు మిమ్మల్ని ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’’ అని అమెరికా కాంగ్రెస్‌ అగ్రనేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఇలాంటి అరుదైన ఘనత పొందిన నాయకుల్లో బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా తదితరులు ఉన్నారు. భారత ప్రధానుల్లో మోదీ కంటే ముందు రాజీవ్‌గాంధీ (జులై 13, 1985), పి.వి.నర్సింహారావు (మే 18, 1994), వాజ్‌పేయీ (సెప్టెంబరు 14, 2000), మన్మోహన్‌సింగ్‌ (జులై 19, 2005)లు అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని