Kim jong un: రైఫిల్‌ గురిపెట్టిన కిమ్‌

దేశం తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో తీరికలేకుండా గడిపేస్తున్నారు.

Updated : 07 Aug 2023 07:56 IST

ఆయుధ కర్మాగారాలను సందర్శించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

సియోల్‌: దేశం తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో తీరికలేకుండా గడిపేస్తున్నారు. తాజాగా దేశంలోని ఆయుధ కర్మాగారాలు, అణ్వాస్త్రాలను మోసుకుపోయే సామర్థ్యమున్న క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటించారు. అగ్రరాజ్యం అమెరికాతోపాటు దక్షిణ కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఆయుధ కర్మాగారాల్లో కిమ్‌ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్రూజ్‌ క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర ఆయుధ కర్మాగారాలు, మానవరహిత గగనతల వాహనాలు (యూఏవీలు), భారీ రాకెట్‌ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను వరుసగా మూడు రోజులపాటు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సందర్శించినట్లు అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ సందర్భంగా పలు ఆయుధాలను కిమ్‌ స్వయంగా పరిశీలించారు. తమ శైలికి అనుగుణంగా దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని.. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇంజిన్లను రూపొందించాలని కిమ్‌ నిపుణులకు సూచించినట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, అత్యాధునిక క్రూజ్‌ క్షిపణులతోపాటు ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణినీ ఆయన పరిశీలించారు. ఇలా వివిధ ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్‌ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. రష్యాతో ఆయుధ సహకార ఒప్పందాల కోసమే కిమ్‌ ఆయుధ కర్మాగారాలను సందర్శించారని, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఉత్తర కొరియా ఆయుధాలను వినియోగించే అవకాశం లేకపోలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని