కుటుంబాలకు కుటుంబాలే బలి

గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులతో రోజూ అనేక మంది మరణిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే హతమవుతున్నాయి.

Updated : 26 Mar 2024 05:39 IST

ఇజ్రాయెల్‌ దాడుల్లో 51మంది మృతి
గాయపడి చికిత్స దొరకని వారెందరో..

డెయిర్‌ అల్‌-బలా, రఫా: గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులతో రోజూ అనేక మంది మరణిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే హతమవుతున్నాయి. గాజా మధ్య ప్రాంతంలోని డెయిర్‌ అల్‌-బలాలో ఉన్న ఒక అపార్టుమెంట్‌పై ఆదివారం జరిగిన దాడిలో రెండు కుటుంబాలకు చెందిన 21 మంది మరణించారు. రఫాలో జరిగిన దాడిలో 30 మంది మృతి చెందారు. డెయిర్‌ అల్‌-బలాలో సల్మాన్‌ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన 10 మంది, బుహెసీ కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. రఫాలో చనిపోయిన 30 మందిలో 10 మంది చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు.

గాజాలోని ఖాన్‌యూనిస్‌లో ఉన్న యూరోపియన్‌ గాజా ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అత్యవసర వైద్య బృందం వెల్లడించింది. సుమారు రెండు వారాలపాటు అక్కడి ఉండి చికిత్సలు అందించిన ఈ బృందం అక్కడి పరిస్థితులను వివరించింది. ఈ ఆసుపత్రిని 200 బెడ్ల నుంచి 1000 బెడ్లకు పెంచారు. అయినా సరిపోవడం లేదు. చాలా మంది గాయపడినవారు గాయాలతో చికిత్సకు నోచుకోవడం లేదు. వీరితోపాటు 22,000 మంది పౌరులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

అల్‌ఖైదా దాడిలో ఐదుగురి మృతి

సనా: యెమెన్‌లోని దక్షిణ ప్రాంతంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఆదివారం రాత్రి జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. అబ్యాన్‌ ప్రావిన్సులోని వాడీ ఓమ్రాన్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ పేరుతో యెమెన్‌ దక్షిణ ప్రాంతాన్ని ఈ గ్రూపు పాలిస్తోంది. దానికి యూఏఈ మద్దతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని