ప్రతిభావంతులకే ఇక బ్రిటన్‌లో ప్రవేశం

బ్రిటన్‌లో ఇకపై ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Updated : 05 Apr 2024 07:28 IST

38,700 పౌండ్ల వార్షిక జీతభత్యాలు పొందగలిగేవారికే అవకాశం
అమల్లోకి నూతన నిబంధనలు

లండన్‌: బ్రిటన్‌లో ఇకపై ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గతంలో 26,200 పౌండ్ల వరకు వార్షిక వేతనం చెల్లించే ఉద్యోగాలు చేయడానికి విదేశీయులకు నైపుణ్య ఉద్యోగ వీసాలు ఇచ్చేవారు. గురువారం ఈ వేతన పరిమితిని 48 శాతం అంటే 38,700 పౌండ్లకు పెంచారు. దీనివల్ల అధిక జీతభత్యాలు చెల్లించే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మాత్రమే విదేశీ సిబ్బంది దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కొత్త నిబంధన భారతీయులకు ప్రతికూలంగా ఉండబోతున్నది. బ్రిటన్‌లోని వైద్య సిబ్బంది, టెక్‌ నిపుణులు, విద్యార్థులలో భారతీయులు ఎక్కువే. కంపెనీలు బ్రిటిష్‌ పౌరులను కాదని చౌకగా విదేశీయులను నియమించుకోకుండా చూడటమే కొత్త ఉత్తర్వుల లక్ష్యం. గతేడాది బ్రిటన్‌లో నైపుణ్య వీసా పొందిన 3 లక్షలమంది ఈ ఏడాది కొత్త నిబంధన వల్ల అనర్హులైపోతారు. చౌకగా లభించే విదేశీ సిబ్బంది వల్ల బ్రిటిష్‌ పౌరుల జీతభత్యాలు కోసుకుపోతున్నాయని, దీన్ని నివారించడానికే కొత్త నిబంధన తెచ్చామని బ్రిటన్‌ హోంమంత్రి జేమ్స్‌ క్లెవర్లీ వివరించారు. ఇక నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులకే నైపుణ్య వీసాలిస్తామని చెప్పారు. బ్రిటన్‌ ప్రభుత్వం చేస్తున్న మార్పులు ఇప్పటికే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2022 సెప్టెంబరులో భారతీయులకు 20,360 నైపుణ్య సిబ్బంది వీసాలు లభించగా 2023లో అవి 18,107కు తగ్గాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే వీసాలూ తగ్గిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని