USA: వృద్ధ జంట లెక్క అదిరింది.. లాటరీలో లొసుగులను వాడుకొని రూ.200 కోట్లు..!

అమెరికాలో ఓ వృద్ధ జంట అదృష్టాన్నే తమ గుప్పిట్లో పెట్టుకొంది. ఓ లెక్క ప్రకారం లాటరీ టికెట్లను కొనుగోలు చేసి కోట్లల్లో సంపాదించింది. 

Updated : 08 Jan 2024 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లో ఓ జంట రిటైర్మెంట్‌ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా 26 మిలియన్‌ డాలర్లు (రూ.200 కోట్లు) సంపాదించింది. ఇదేమీ అదృష్టంతో వచ్చిన మొత్తం కాదు.. తమకు వచ్చిన గణిత విద్యను వాడి శ్రమించి సంపాదించిన మొత్తం కావడం విశేషం. మిషిగాన్‌లోని ఎవర్ట్‌ ప్రాంతంలో జెర్రీ, మార్జ్‌ సెల్బీ జంట ఒక స్టోర్‌ నిర్వహించేవారు. తమకు 60 ఏళ్లు దాటగానే దానిని విక్రయించి విశ్రాంతి జీవితం ప్రారంభించారు. 

2003లో విన్‌ఫాల్‌ అనే లాటరీ గేమ్‌ గురించి జెర్రీ తెలుసుకొన్నాడు. గణిత శాస్త్రంపై పట్టున్న అతడు సదరు లాటరీలో కొన్ని లొసుగులను కనిపెట్టాడు. ఒక వ్యూహం ప్రకారం వెళితే కచ్చితంగా సొమ్మును సంపాదించవచ్చని గుర్తించాడు. ఈ జాక్‌పాట్‌ సొమ్ము 5 మిలియన్‌ డాలర్లకు చేరుకొని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్‌ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుంది. లెక్క ప్రకారం 1,100 డాలర్లను వెచ్చించి.. కొన్ని సంఖ్యలున్న 1,100 టికెట్లు కొనుగోలు చేస్తే కనీసం 1,900 డాలర్లు పొందవచ్చని గ్రహించాడు. 

మాల్దీవులకు ఫ్లైట్‌ బుకింగ్స్‌ నిలిపివేసిన ఈజ్‌మైట్రిప్‌

ఆ వృద్ధ జంట తొలుత ప్రయోగాత్మకంగా 3,600 డాలర్లను ఖర్చు చేసి విన్‌ఫాల్‌ టికెట్లను కొనుగోలు చేసింది. అప్పుడు 6,300 డాలర్లు సంపాదించింది. ఆ తర్వాత 8,000 డాలర్లతో టికెట్లు కొన్నారు. మరోసారి లాభం రెట్టింపైంది. సంపాదన బాగుండటంతో తర్వాత జీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీస్‌ అనే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కొందరు మిత్రులు, సన్నిహితులను సభ్యులుగా చేర్చుకొన్నారు. మసాచుసెట్స్‌లో విన్‌ఫాల్‌ వంటి లాటరీ నిర్వహిస్తే అక్కడకు వెళ్లి భారీ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేశారు. 

గత తొమ్మిదేళ్లలో తాము, తమ బృందం కలిపి మొత్తం 26 మిలియన్‌ డాలర్లను సంపాదించినట్లు జెర్రీ, మార్జ్‌ జంట చెప్పింది. తాము ఏకంగా 8 మిలియన్‌ డాలర్ల మేరకు లాభాలకు ముందే పన్ను చెల్లించినట్లు వెల్లడించింది. లాటరీల ద్వారా వచ్చిన సొమ్ముతో తమ ఇంటిని పునరుద్ధరించుకొన్నామని.. పిల్లలను చదివించుకొన్నట్లు వెల్లడించారు. 

పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ఒక దశలో వీరిపై ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ విచారణ చేపట్టారు. కానీ, పూర్తిగా నిబంధనల ప్రకారం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు దానిలో తేలింది. ఇక వీరి జీవితంపై  ఒక సినిమా కూడా వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని