Taiwan: మేము క్షేమంగా ఉంటేనే.. ప్రపంచానికి ‘చిప్స్‌’ సరఫరా..!

తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్‌ ఆర్థిక మంత్రి వాంగ్‌ మెయి-హువా పేర్కొన్నారు. మంగళవారం ఆమె అమెరికాలో పర్యటించారు.

Updated : 12 Oct 2022 12:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్‌ ఆర్థిక మంత్రి వాంగ్‌ మెయి-హువా పేర్కొన్నారు. మంగళవారం ఆమె అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్స్‌ సరఫరా పై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఏమాత్రం దుందుడుకుగా వ్యవహరించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సైనిక శక్తితో తమ సెమీకండెక్టర్‌ సంస్థలను స్వాధీనం చేసుకోలేరన్నారు.

వాంగ్‌ తన పర్యటనలో భాగంగా ‘సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌’లో మాట్లాడారు. తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకొంటే చైనాపై ఆ ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన చిప్స్‌ తయారీ కాంట్రాక్టర్‌ అయిన తైవాన్ సెమీకండక్టర్‌ మానిఫ్యాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ)ని సైనిక శక్తితో స్వాధీనం చేసుకుంటే.. అది కార్యకలాపాలను నిలిపివేస్తుందని పేర్కొన్నారు. 

‘‘తైవాన్‌కు ఏమి జరిగినా.. దాని ప్రతికూల ప్రభావం ప్రపంచంపై పడుతుంది’’ అని గతంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలను వాంగ్‌ ఈ సందర్భంగా  ప్రస్తావించారు. ఇదే విషయాన్ని తాను మరోరకంగా చెప్పాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘తైవాన్‌ క్షేమంగా ఉంటే.. ప్రపంచ సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. అమెరికా, దాని మిత్రదేశాలతో కలిసి అత్యంత సమర్థంగా చిప్స్‌ ఉత్పత్తి చేయడానికి తైవాన్‌ అత్యంత ఆసక్తిగా ఉంది’’ అని పేర్కొన్నారు. అమెరికా-తైవాన్‌ సంబంధాలు బలోపేతం చేయడంపై అమెరికా కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు మద్దతునివ్వడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.

అమెరికా దేశీయంగా చిప్స్‌ తయారీ పరిశ్రమను ప్రోత్సహించడంపై తాము ఆందోళన చెందడంలేదని వాంగ్‌ పేర్కొన్నారు. తైవాన్‌లో దాదాపు 40 ఏళ్లుగా నిర్మించుకొంటూ వచ్చిన సెమీకండెక్టర్‌ పరిశ్రమ చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. తైవాన్‌ వంటి మరో సరఫరా వ్యవస్థను సృష్టించడంగానీ, భర్తీ చేయడంకానీ చాలా కష్టమని వాంగ్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని