Iran: నలుగురు మొసాద్‌ ఏజెంట్లకు మరణశిక్ష అమలు: ఇరాన్‌

ఇరాన్‌ (Iran)లో తాజాగా మొసాద్ గూఢచారులను ఉరితీశారు. ఈ విషయాన్ని ఆ దేశ న్యాయశాఖ వెల్లడించింది.

Updated : 29 Jan 2024 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులకు ఇరాన్‌ (Iran)లో సోమవారం మరణశిక్ష అమలుచేశారు. వీరు ఆ దేశ రక్షణ విభాగానికి చెందిన కీలక ప్రదేశాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు అక్కడి కోర్టు నిర్ధారించింది. ఇరాన్‌ ఇస్ఫాహాన్‌ ప్రావిన్స్‌లోని ఓ స్థావరంలో కుట్రకు తెరతీశారన్న ఆరోపణలపై 2022లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారని న్యాయశాఖకు చెందిన వెబ్‌సైట్‌ వెల్లడించింది. వీరిని మహమ్మద్‌ ఫరమార్జి, మొహసీన్‌ మజ్లమ్‌, వాఫా అజర్బార్‌, పిజ్‌మన్‌ ఫతేహ్‌లుగా గుర్తించారు.

‘‘ఇస్ఫాహాన్‌లో బాంబింగ్‌ చేయాలని యూదుల గూఢచార సంస్థతో కలిసి కుట్ర పన్నిన నలుగురిని అరెస్టు చేశాం. వారికి సోమవారం ఉదయం మరణశిక్ష విధించాం. వీరిని ఏడాదిన్నర క్రితం మొసాద్ సంస్థ నియమించుకొని ఆఫ్రికా దేశాలకు తరలించింది. అక్కడ సైనిక కేంద్రాల్లో ఇజ్రాయెల్‌ అధికారుల సమక్షంలో శిక్షణ ఇచ్చింది. 2023 సెప్టెంబర్‌లోనే ఈ నలుగురికి మరణశిక్ష విధించాం’’ అని ఆ వెబ్‌సైట్‌లో ఉంచింది. 

గతేడాది ఆగస్టులో తమ బాలిస్టిక్‌ క్షిపణి ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి మొసాద్ పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఇస్ఫాహాన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇజ్రాయెల్‌ డ్రోన్‌తో దాడి చేసిందని ఆరోపించింది.

‘ఇది భయానక ట్రెండ్‌’: డీప్‌ఫేక్‌లపై సత్యనాదెళ్ల ఆందోళన

బ్రిటన్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవలే రక్షణశాఖ మాజీ ఉద్యోగి అలీరెజా అక్బరీకి కూడా మరణశిక్ష విధించింది. ఆయన ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ఎంఐ6 ఏజెంట్‌గా మారినట్లు ఇరాన్‌ చెబుతోంది. ఈనేపథ్యంలో అతడిని ఉరి తీసినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇక డిసెంబర్‌లో కూడా ఒక మొసాద్ ఏజెంట్‌ను జెహెదాన్‌లో ఉరి తీసినట్లు చెప్పింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని