Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!

రోమ్‌లోని వాటికన్‌ సిటీలో మూసిఉన్న బ్యాంకును దోచేయాలని ఓ దొంగల ముఠా భావించింది. అయితే షటర్‌ తాళాలు బద్దలు కొట్టి చొరబడితే దొరికిపోతామని.........

Updated : 14 Aug 2022 13:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోమ్‌లోని వాటికన్‌ సిటీలో మూసిఉన్న బ్యాంకును దోచేయాలని ఓ దొంగల ముఠా భావించింది. అయితే షటర్‌ తాళాలు బద్దలు కొట్టి చొరబడితే దొరికిపోతామని భావించిన ఐదుగురు సభ్యులు గల ఆ ముఠా.. ఏకంగా సొరంగం తవ్వి, అందులోనుంచి బ్యాంకు లోపలికి వెళ్లి లూటీ చేయాలని భావించింది. అనుకున్నదే తడువుగా తమ పనిని ప్రారంభించింది. ఓ మూసిఉన్న దుకాణంలో నుంచి సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టింది. ప్రతిరోజు కొద్దికొద్దిగా తవ్వుతూ.. ఇప్పటికే ఆరు మీటర్ల మేర సొరంగాన్ని తవ్వేశారు కూడా.

అయితే, మరికొన్ని మీటర్లు తవ్వేస్తే ఆ బ్యాంకు మొత్తాన్ని ఊడ్చేయొచ్చు అని ఉవ్విళ్లూరిన ఆ ముఠాకు ఊహించని ఘటన ఎదురైంది. ఉన్నట్లుండి ఆ సొరంగం కూలిపోయింది. ఎలాగోలా నలుగురు సభ్యులు బయటపడగా.. ముఠా నాయకుడు మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. దీంతో ఏం చేయాలో బోధపడని సభ్యులు.. విషయం మొత్తాన్ని పోలీసులకు ఫోన్‌ చేసి వివరించారు.

సహాయక బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆరు మీటర్ల లోతులో ఉన్న అతడిని కాపాడేందుకు నానా అవస్థలు పడ్డారు. సమాంతరంగా మరో గోతిని తవ్వారు. ‘రక్షించండి, ఈ సొరంగంలోనుంచి బయటకు తీసుకెళ్లండి’ అంటూ అరుపులు వినిపించగా.. అతడికి పైపుల ద్వారా ఆక్సిజన్‌తోపాటు ద్రవరూపంలో ఆహారాన్ని అందించారు. ఎట్టకేలకు 8గంటల నిర్విరామ ప్రయత్నం అనంతరం అతడిని బయటకు తీశారు. గాయాలతో ఉన్న దొంగను ఆసుపత్రికి తరలించారు. ఆపై మిగతా నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని