India-Maldives: భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ

భారత్‌-మాల్దీవుల(India-Maldives) మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. 

Updated : 19 Jan 2024 11:16 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత(India) ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల (Maldives) మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగమంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చించారు. వీటి వివరాలను తమ ఎక్స్‌ ఖాతాల్లో వెల్లడించారు.

ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ(NAM) సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్.. మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. ‘మా మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగింది. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి భేటీల విషయంలో మా అభిప్రాయాలను పంచుకున్నాం. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించాం’ అని జైశంకర్‌ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి తెలిపారు.

ఇటీవల ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న భారత దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాలే కోరిన సంగతి తెలిసిందే. అక్కడ 88 మంది భారత్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని