Ukraine Crisis: తొలిసారి రష్యా సైనికుడి యుద్ధ నేరాలపై విచారణ..!

మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత తొలి సారిగా ఓ రష్యా సైనికుడి యుద్ధనేరాలపై విచారణ మొదలుకానుంది. 21ఏళ్ల వాడిమ్‌ షిషిమారిన్‌ అనే రష్యా సైనికుడు నిరాయుధుడైన 62 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటు చేసుకొంది. 

Published : 14 May 2022 02:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత తొలిసారిగా ఓ రష్యా సైనికుడి యుద్ధ నేరాలపై విచారణ మొదలు కానుంది. 21 ఏళ్ల వాడిమ్‌ షిషిమారిన్‌ అనే రష్యా సైనికుడు.. నిరాయుధుడైన 62 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకొంది. ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28న సుమీ ప్రాంతంలోని ఓ గ్రామంలో వాడిమ్‌ తన కలష్నికోవ్‌ రైఫిల్‌తో కారులో నుంచి ఓ వృద్ధుడిపై గురిపెట్టి పలుమార్లు కాల్పులు జరిపాడు. తన ఇంటికి కొద్ది దూరంలో ఆ వృద్ధుడు కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి ఉక్రెయిన్‌ దర్యాప్తు బృందం అవసరమైన ఆధారాలను సంపాదించింది. ఈ సైనికుడి పాత్ర ఉందని నిర్ధారించి న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. యుద్ధ నిబంధనల ఉల్లంఘన, హత్య వంటి నేరాలు అతడిపై మోపారు. ఈ నేరాలకు 10 నుంచి 15 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. రష్యా సైనికుడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ ఎటువంటి ఆధారాలను సేకరించిందో మాత్రం బహిర్గతం చేయలేదు. 

గాయపడిన వారిని తరలిస్తూ దొరికి పోయి..

ఉక్రెయిన్‌కు చెందిన వొలొదిమిర్‌ జోల్‌కిన్‌ అనే యూట్యూబర్‌ మార్చి19న రష్యా సైనికుడు వాడిమ్‌ షిషిమారిన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. జోల్‌కిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో బంధీలుగా మారిన రష్యా సైనికులను నేరుగా ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్‌ అయ్యాడు. ఆ సైనికుల కుటుంబాలతో మాట్లాడిస్తుంటాడు కూడా. వాడిమ్‌ ఇంటర్వ్యూ సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. 

జనవరిలో సైనిక విన్యాసాల్లో భాగంగా ఉక్రెయిన్‌కు 200 మైళ్ల దూరంలోని ఓ నగరానికి తరలించినట్లు చెప్పాడు. ఆ తర్వాత రష్యా యుద్ధం ప్రకటించడంతో వాడిమ్‌ ఉన్న దళం ఉక్రెయిన్‌లోకి చొరబడిందని వివరించాడు. చివరికి పోరాటంలో గాయపడిన సహచరులను రష్యా తరలిస్తుండగా.. వారి బృందాన్ని ఉక్రెయిన్‌ బలగాలు చుట్టుముట్టడంతో దొరికిపోయినట్లు పేర్కొన్నాడు. మరోపక్క అసలు యుద్ధానికి వెళుతున్న విషయం వాడిమ్‌కు తెలియదని అతని తల్లిదండ్రులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని