USA: చైనా, రష్యాల బంధం బలపడితే.. ఏం చేయాలో భారత్‌ నిర్ణయించుకోగలదు..: బైడెన్‌

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విషయంలో భారత్‌ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచీ స్పందిస్తోంది. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌- భారత ప్రధాని మోదీ వర్చువల్‌ భేటీ అనంతరం అమెరికా ఈ మేరకు అభిప్రాయపడింది. ఈ భేటీ అనంతరం శ్వేతసౌధంలో

Updated : 12 Apr 2022 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విషయంలో భారత్‌ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచి స్పందిస్తోంది. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌- భారత ప్రధాని మోదీ వర్చువల్‌ భేటీ అనంతరం అమెరికా స్పందనను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈ భేటీ అనంతరం శ్వేతసౌధంలో విలేకర్లు.. అమెరికా పక్షాన భారత్‌ ఉంటుందా..? అని ప్రశ్నించారు. దీనికి బైడెన్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఒకవేళ రష్యా-చైనాల బంధం బాగా బలపడినట్లు అనిపిస్తే  కచ్చితంగా భారత్‌ ఆలోచనా విధానంపై  అది  ప్రభావం చూపిస్తుంది ’’ అని పేర్కొన్నారు.

బుచాలోని నరమేధంను భారత్‌ తీవ్రంగా ఖండించడాన్ని, వీటిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన విషయాన్ని శ్వేతసౌధం మీడియా అధికారులు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో కొంత బలమైన ప్రకటనలు చేయడమే భారత స్వతంత్ర వైఖరికి నిదర్శనమని  పేర్కొన్నారు. దీంతోపాటు భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు మానవీయ సాయం అందుతోందని వెల్లడించారు. అమెరికా నిరంతరం భారత్‌తో చర్చలు జరుపుతుంటుందని చెప్పారు. 

చమురు ఆందోళనలను తిప్పికొట్టిన భారత్‌..

రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయడంపై అమెరికా ఆందోళనలను భారత్‌ కొట్టిపారేసింది. 2+2 చర్చల సందర్భంగా.. భారత మంత్రులు జైశంకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా మంత్రులు ఆంటోని బ్లింకన్‌, లాయిడ్‌ ఆస్టిన్లు సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘మీకు చమురు కొనుగోళ్లకు సంబంధించిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశం వస్తే.. మీ దృష్టి ఐరోపాపై ఉండాలి. భారత్‌ కూడా  ఇంధన అవసరాల రీత్యా కొనుగోలు చేస్తుంది. కానీ, అంకెలను పరిశీలిస్తే.. భారత్‌ నెలరోజుల్లో కొనుగోలు చేసినంత చమురును ఐరోపా ఒక్క సాయంత్రంలో కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణపై మా దేశం చేసిన ప్రకటనలే వైఖరిని వెల్లడిస్తాయి. ఐరాస, భారత పార్లమెంట్‌, ఇతర వేదికలపై మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా వైఖరి. ఈ లక్ష్య సాధనకు అవసరమైన సహకారాన్ని అన్ని రకాలుగా అందజేస్తాం’’ అని వెల్లడించారు.

ఆ విషయం భారత్‌కు వదిలేయండి..: జెన్‌సాకీ

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇక పెంచబోమని భారత్‌ నుంచి ఏమైనా హామీని అధ్యక్షుడు జోబైడెన్‌ సాధించారా..? అన్న ప్రశ్నకు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ స్పందించారు. ‘‘ ఈవిషయాన్ని ప్రధాని మోదీ, భారతీయులకు వదిలేయండి. వారు ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది కేవలం 1 నుంచి 2శాతం మాత్రమే. వారు అమెరికా నుంచి 10శాతం కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు.. ఆంక్షలకేమీ విరుద్ధం కావు. ఇది నిర్మాణాత్మకమైన సంభాషణ కాదు. మేము వేర్వేరు దేశాలకు ఉండే సొంత అవసరాలను పరిగణనలోకి తీసుకొంటాం’’ అంటూ జెన్‌సాకీ తోసిపుచ్చారు. భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు మానవీయ సాయం పంపడాన్ని ఆమె అభినందించారు.

మానవహక్కుల ఉల్లంఘనల ప్రస్తావన..

భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు పెరగడాన్ని గమనించినట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ అన్నారు. వీటికి ముగింపు పలికేవరకు ఈ  అంశంపై నిరంతరం భారత్‌తో మేము సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఆందోళనకర ఘటనలు పెరగడాన్ని గమనించామని తెలిపారు. వీటిల్లో జైళ్ల సిబ్బంది, పోలీసులు పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు కూడా ఉన్నాయన్నారు. అంతకు మించి బ్లింకన్‌ మరే వివరాలను వెల్లడించలేదు.

మోదీని, భారత్‌ను విమర్శించడానికి  ఇష్ట పడటంలేదా? అని ప్రతినిధుల సభకు చెందిన రిప్రజెంటేటీవ్‌ ఇల్హాన్‌ ఒమర్‌ కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బ్లింకన్‌  మానవహక్కులపై వ్యాఖ్యానించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని