‘కూరగాయతో పోటీలో లిజ్‌ ట్రస్‌ ఓటమి’.. ఈ వింత బెట్టింగ్‌ ఏంట్రా సామీ!

బ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్‌ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ ప్రారంభించింది. కూరగాయ ముందుగా కుళ్లిపోతుందా? లిజ్‌ ట్రస్‌ పదవి ముందుగా పోతుందా? అనేది పోటీ!

Published : 21 Oct 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫలానా మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు.. నాదీ 100 రూపాయల బెట్‌’.. ‘ఆ ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలవకపోతే నేను ఇకపై ఓటెయ్య!’.. సాధారణంగా బెట్టింగ్‌లంటే ఇలానే ఉంటాయి. కానీ, బ్రిటన్‌లో గడిచిన వారం రోజులుగా ఓ బెట్టింగ్‌ నడిచింది. హోరాహోరీ పోరులో ఆ దేశ ప్రధాని లిజ్‌ ట్రస్‌పై ఓ కూరగాయ గెలుపొందింది. కూ..ర..గా..య.. గెలుపొందిందా? వినడానికి ఆశ్చర్యంగా కదూ! అయితే ఆ పోటీ ఏంటో తెలుసుకోవాలి.

బ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్‌ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ నిర్వహించింది. క్యాబేజీని పోలిన ఓ కూరగాయ (lettuce)ను ఒక పక్క.. బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఫొటోను ఒక పక్క పెట్టింది. ఈ కూరగాయ ముందుగా కుళ్లిపోతుందా? లిజ్‌ ట్రస్‌ పదవి ముందుగా పోతుందా? అనేది పోటీ! గడిచిన వారం రోజులుగా యూట్యూబ్‌లో ఈ లైవ్‌స్ట్రీమ్‌ నడుస్తూనే ఉంది.

లిజ్‌ ట్రస్ ఆర్థిక నిర్వహణపై సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు లిజ్‌ట్రస్‌ తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. దీంతో ఆ డెయిలీ ‘మా lettuce గెలిచిందోచ్‌!’ అంటూ వెంటనే ట్వీట్‌ చేసింది. దీనిపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం స్పందించారు. ఈ పోటీ గురించి వారం క్రితమే ట్వీట్‌ చేసిన ఆయన.. తాజాగా ఆ కూరగాయే విజయం సాధించిందంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఏదైమైనా నిన్నటి వరకు పదవికి రాజీనామా చేయబోనంటూ చెబుతూ వచ్చిన లిజ్‌ ట్రస్‌ పదవీ గండాన్ని వారం ముందుగా ఊహించిన ఆ పత్రిక కాన్ఫిడెన్సును మెచ్చుకోవాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని