Royal lifestyle: 38 విమానాలు, 300 కార్లు.. ఆయన రాజభోగాలు చూస్తే కళ్లు చెదరాల్సిందే!

ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ (King Maha Vajiralongkorn) సంపద విలువ రూ3.లక్షల కోట్లు పైనే ఉన్నట్లు అంచనా.

Published : 09 Jan 2024 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాచరికం అంటేనే ఐశ్వర్యానికి పర్యాయపదం. అటువంటి దర్పాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తున్న వ్యక్తుల్లో థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ (King Maha Vajiralongkorn) ఒకరు. కింగ్‌ రామా (King Rama X)గా పిలిచే ఆయన సంపద విలువ రూ3.లక్షల కోట్లు పైనే. వేల ఎకరాల భూమి, 38 విమానాలు, వందల కార్లు, సుమారు రూ.వంద కోట్ల విలువైన వజ్రవైడూర్యాలు. ఇలా ఎన్నో రకాల విలువైన వస్తువులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ సంపదను ఓసారి పరిశీలిస్తే..

థాయిలాండ్‌ రాజు (King of Thailand) మహా వచిరలాంగ్‌కాన్‌ కుటుంబం సంపద విలువ సుమారు రూ.3.2లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా. 16,210 ఎకరాల భూమి, దేశ వ్యాప్తంగా 40వేల స్థిరాస్తులతో దేశంలో అతిపెద్ద భూస్వామిగా నిలిచారు. వీటిలో ప్రభుత్వ భవనాలు, మాల్స్‌, హోటళ్లు ఉండటం విశేషం. థాయిలాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంకు సియామ్‌ కమర్షియల్‌ బ్యాంకులో వీరికి 23శాతం వాటా ఉంది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన సియామ్‌ సిమెంట్‌ గ్రూప్‌లోనూ 33.3శాతం వాటా కలిగి ఉన్నారట.

భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?

రాజకుటుంబానికి బోయింగ్‌, ఎయిర్‌బస్‌ విమానాలు కూడా ఉన్నాయట. 21 హెలికాప్టర్లతో కలిపి వీటి సంఖ్య 38 ఉన్నట్లు సమాచారం. వీటన్నింటి వార్షిక నిర్వహణ ఖర్చే రూ.524 కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్‌ బెంజ్‌, లిమజీన్‌తో సహా 300 లగ్జరీ కార్లు, బంగారు తాపడంతో కూడిన 52 పడవలూ ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన 545 క్యారెట్‌ ‘గోల్డెన్‌ జూబ్లీ డైమండ్‌’ (The Golden Jubilee diamond) కూడా వీరి వద్దే ఉంది. దాని విలువ సుమారు రూ.98కోట్లుగా అంచనా. 

1782లో నిర్మించిన రాజభవనమే 23లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉందట. అయితే, రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ ఆ చారిత్రక సౌధంలో నివసించడం లేదు. ప్రస్తుతం అందులో ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని